Sunday, August 07, 2016

వెండి తీగలు



మూడేళ్ళ క్రితం తలలో కనిపించావ్.. మా ఇంటి యజమానిని పెట్టించి నీ పీక తెగ కోయించా. మూడు నెలల క్రితం గడ్డంలో కనిపించావ్.. మంటలేస్తున్నా రోజుమార్చి రోజు షేవింగ్ చేస్తూ నీ ఉనికి లేకుండా చేస్తున్నా. మూడు వారాల క్రితం మీసంలో.. మూడు రోజుల క్రితం నాసికా కుహురంలో. కానీ..కానీ.. మూడు నిమిషాల క్రితం కను బొమలు.. చివరికి రెప్పలలో కూడా నిన్ను చూశాక ఇప్పుడర్థమయింది 'ఇందు గలదందు లేదని సందేహము వలదు శిరస్సంతా ఎందెందు వెదకిన అందందే కలదు'. సర్వాంతర్యామీ.. ఈ లైను నీకు పూర్తిగా నప్పుతుంది.

Sunday, July 31, 2016

గురవయ్య మాష్టారు




ఒరేయ్ దరహాస్ ఆ ఏడుపు ఆపరా క్లాసులో అసయ్యంగా.

అమ్మా షర్మిళా మమ్మల్ని సిగ్గుపెట్టకుండా కాస్త తిన్నగా కూర్చోటం అలవాటు చేసుకోతల్లి. పై తరగుతుల్లోకెళితే ఇలాటివి ఎవరూ చెప్పలేరు, చెప్పరు.

నాయనా కుచేలకృష్ణ బ్రేక్ లో తిందువు ఆ అటుకులు లోపల పెట్టు.

అమ్మా సుభాషిణీ.. ఆడపిల్లలు అలా బూతులు మాట్లాడితే ఆట్టే బాగోదమ్మా. తగ్గించు.

బాబూ జ్ఞానేశ్వర్.. ఒకటో ఎక్కం చదవటమేవిటిరా? నీ బండ బడ.

అమ్మా సునయన.. కళ్ళకి కాటుక మాత్రం దట్టంగా పట్టిస్తావ్, కాని కళ్ళద్దాలు మర్చిపోయొస్తే ఎలామ్మా?

శ్రీమంత్ బాబూ.. ఆర్నెల్లవుతుంది స్కూలు ఫీజు కట్టక, మీ నాన్న కుబేర్రావ్ గారికి కాస్త గుర్తుచెయ్.

అమ్మా వృక్షశ్రీ.. అబ్బా ఆ పేరు పిలవాలన్నా రాయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది తల్లీ. మీ నాన్నగారు 'సుందర్ లాల్ బహుగుణ అభిమాని' అవటం మా చావుకొచ్చింది.

కోమలీ.. నువ్వలా క్లాసులో మగపిల్లల్ని కూడా కొడుతుంటే నాక్కూడా కాస్త భయంగానే ఉంటుంది ఈ మధ్య.

ప్రియ దర్శినీ.. తలకు ఏ బ్రాండు ఆముదం వాడతావో చెబితే మా చంటోడికి అజీర్తి.. వద్దులే ఈ సారికి అల్లోపతిని నమ్ముకుంటా.

స్వప్నా.. అలా క్లాసులో పడుకోకూడదమ్మా.. లే.. ఏదీ.. చెయ్యి వెనక్కి తిప్పు.

రేయ్ సుశీల్.. ఆడపిల్లలతో ఆ వెకిలి చేష్టలేంటిరా..? ఏదీ.. వెనక్కి తిరుగు.

Wednesday, July 13, 2016

ప్రసవ వేదన



హాస్పిటల్ లో ఓ స్త్రీమూర్తి ప్రపంచ జనాభా++ చేయడానికి ప్రసవ వేదన అనుభవిస్తుంది. ప్రసవ రోదన ప్రదాత ఆవిడ భర్త మూర్తేమో హాస్పిటల్ బయట టీ బండి దగ్గర వేళ్ళ మధ్యలోంచి ఊపిరితిత్తుల్లోకి పొగతోబాటు అమ్మాయా? అబ్బాయా? అనే కన్ఫ్యూజన్ని పీలుస్తూ..  రింగు, రింగులోరింగు,  ఆ రింగులో ఇంకో రింగు వదులుతున్నాడు ఆటవిడుపుగా. తన కలలో వచ్చిన అందమైన ఊహకు పదరూపం ఇవ్వడానికి ప్రసవ వేదన అనుభవిస్తున్నాడు ఆ పక్కనే పార్కులో ఒక మారుమూల బెంచి మీద ఓ కవితామూర్తి.కానీ పాపం ఈ మూర్తిగారికి నొప్పులు మొదలై నెలక్రితంమే నెలైంది. అదే పార్కులో నాలుగు బెంచీలవతల ఈరోజైనా ఎలాకోలా తను ప్రేమిస్తున్న విషయం తెలుగులోనే, ఇంగ్లీషులోనో, హిందీలోనో చెప్పాలని ప్రసవ వేదన అనుభవిస్తున్నాడు ఒక ప్రేమమూర్తి. ప్రియురాలు మాత్రం ప్రేమతో.. “మూర్తీ.. ఐస్క్రీమ్ మీద ఇవాళ్టి కెరామెల్ టాపింగ్ కన్నా నిన్నటి చాకొలేట్ టాపింగే బావుంది” అని బ్రేవుమంది. ఈ మూర్తి గాడి వేదన/రోదన మొదలై ఎన్నాళ్ళయిందో మీ ఊహకే వదిలేస్తే..  పార్కుకి ఆనుకుని ఉన్న కాలేజీలో ఇన్విజిలేటర్ ఇప్పుడే వడ్డించిన వేడి వేడి క్వశ్చన్ పేపర్లోంచి తెలియని ప్రశ్నలకి జవాబులు రాయడానికి ఆ విద్యామూర్తి పడేది ప్రసవ వేదన కాకపోతే ఇంకేంటి?

Saturday, May 14, 2016

మౌనంతో ముచ్చట్లు




ఈతరాని ఒక మనిషి, చుట్టూ కాపాడేనాథుడు లేని పరిస్థితుల్లో.. నడిసంద్రంలో పడవలోంచి జారి నీళ్ళలో పడ్డాడు. మెదట కొన్ని క్షణాలు ప్రాణంకోసం పాకులాడినా.. తరువాత కాపాడేవారు లేరని తెలిసి ప్రాణం మీద అశపోయి (అనేకన్నా వదిలేసి) వేలమీటర్ల లోతున్న సముద్రంలోకి ఆలోచనకొక్క అంగుళం చొప్పున మునిగిపోతూ తన జ్ఞాపకాల పొరల్లోంచి మనసుకి ఇంచి ఇంచి దూరంగా ఒక్కొకర్ని గుర్తు చేసుకుంటూ గడిపే ఆ చివరి క్షణాలు (అనేకన్నా యుగాలు) ఎంతో భారంగా ఉంటాయి. అది పరిపూర్ణ ఏకాంతం. నిస్వార్ధభరితం. శ్వేతవర్ణభరిత మౌనం. క్షణాల్లో జీవితమంతా తన కళ్ళ ముందు కదులుతుంది. ప్రేమలు, బంధాలు, బాధ్యతలు, భవిష్యత్తు... అవును ప్రేమించిన వారి భవిష్యత్తు, అది భార్య పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కావచ్చు. ఇష్టపడ్డ పని లేదా లక్ష్యం కావచ్చు. 
నిత్య జీవితంలో కూడా ప్రతి మనిషి (ఏ కాంత చెంత లేని) ఏకాంతంలో అంత కాకపోయినా ఎంతో కొంత మౌనం ఆవహించిన క్షణాల్లో దేని గురించి ఆలోచిస్తాడు. ఒంటరిగా ఒక సుదూర ప్రయాణంలో, సంధ్యాసమయంలో సాగరతీరంలో, వేసవిలో ఓ వెన్నెల రాత్రిలో, కళ్ళు తెరచి తీక్షణంగా ఆ శూన్యంలో ఏం చూస్తాడు. ఆ నిశ్శబ్ద సంగీతం ఏ రాగం. నిష్కల్మషమైన ఆ తెల్లని మౌనంతో ఎలాంటి ముచ్చట్లు చెపుతాడు. తన రహస్యాల పెట్టెలోంచి ఒక్కొక్క వస్తువు బయటికి తీస్తాడు. ఆ వస్తువులు పోగొట్టుకున్న మనుషులు, వాళ్ళ ప్రేమలు, తెగిపోయిన బంధాలు తరువాత తెలిసిన వాటి విలువలు, చేజారిన అవకాశాలు, దరిచేరిన విజయాలు, వెంటపడే ఓటమి భయాలు ఇలా ఏవైనా కావచ్చు. ఒక్కొక్క వస్తువు వంక మనసారా చూసుకుని, జ్ఞాపకాలు నెమరువేసుకుని ముద్దు ముచ్చట్లాడి మళ్ళా పదిలపరుచుకుంటాడు. ఒక్కోసారి ఆ మౌనంలో కూడా ఆలోచనకీ ఆలోచనకీ మధ్య మౌనం ఆవహించవచ్చు. ఆ సంభాషణలో తన ఆత్మ సాక్షాత్కారం కావచ్చు. ఆత్మావలోకనంలో తన తప్పులు తను తెలుసుకోనూవచ్చు. తన సమస్యకి పరిష్కారం దొరకవచ్చు. 
అలా మనలో మనల్ని మనముందు ప్రతిష్టించుకుని మనసులో దాచుకున్న ప్రశ్నలడిగి, దాచుకోలేని జవాబులు చెప్పి చేసే ఆత్మ సంభాషణ, ఆ మౌనంతో మనసు చెప్పే ముచ్చట్లు ఎంతో అందంగా ఉంటాయి.

Thursday, May 05, 2016

సర్వజ్ఞానానాం లౌక్యం ప్రధానం



జ్ఞానోదయం 
"సర్వజ్ఞత" అనేది సైద్ధాంతికం (theoretical), అనంతం. అంటే లెక్కల్లో (infinity) 'లాంటిది కాదు', అదే. ఇది నాస్థి అనిచెప్పాలి. పదార్ధస్పృహ నశించినవారికి లభించే బ్రహ్మజ్ఞానానికిది కనీసార్హత.
"నిర్దిష్ట జ్ఞానం" ఏదేని ఒక విషయం గురించి కూలంకషంగా అధ్యయనం చేస్తేనే లభిస్తుంది. ఉదాహరణకి వైద్యంలో దంతవైద్యం లాగానన్నమాట.
"అ-జ్ఞానం".. అదొకరకపు జ్ఞానం, చాలా ప్రాధమికం. ముఖ్యంగా పశుపక్ష్యాదుల్లో, పసి పిల్లల్లో పుష్కలంగా ఉంటుంది. కొందరిలో పెద్దైనా పోదు. ఇదే ప్రపంచాన్ని నడిపిస్తుంది. పదార్ధ జీవనవిధానానికి ఇది పట్టుకొమ్మ. ఇదే మిడి మిడి జ్ఞానంగా కొన్ని సందర్భాల్లో చలామణీ అవుతుంది.
సాధారణ జ్ఞానం (common sense) ఇది తప్పనిసరి. ఇది కొరవడితే కష్టాలే… ముఖ్యంగా ఎదుటివారికి. కొందరిలో ఇది సందర్భాన్నిబట్టి బహిర్గతమౌతుంది. 
లెక్కల్లో సున్నా(0) కి శున్యానికి(ø) ఉన్న తేడానే అజ్ఞానానికి జ్ఞానశూన్యానికి ఉంది. 
అజ్ఞాని కానివాడు జ్ఞాని కాలేడు ఎందుకంటే 'వేయిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలౌతుంది' అన్నారుగా జ్ఞానాగ్రేసరులు.
విద్యుత్ ప్రవాహంలాగే జ్ఞాన ప్రవాహం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేవలం జ్ఞాన ప్రసారం మాత్రమే జరుగుతుంటుంది, బాబాల దగ్గర.
ఎన్ని జ్ఞానాలున్నా "సర్వజ్ఞానానాం లౌక్యం ప్రధానం" అని నా అభిప్రాయం. విజయలక్ష్మి గుడికి 5 మెట్లయితే ఇది అదృశ్యమైన(invisible) 6వ మెట్టు. ఆధునిక ప్రపంచంలో ఇది వజ్రాయుధం, రామబాణం, కవచకుండలం లాంటి వాటికన్నా శక్తివంతమైనది.
అందుకే ప్రపంచంలోని జ్ఞాన సమూహాన్ని చక్కగా ఒక బెల్ కర్వ్ లో ఇలా కుదించవచ్చునని... దించా.
ఇవికాక మీకు తెలిసిన జ్ఞానాలేవైనా ఉంటే క్రింద కామెంటండి :-)

నువ్వు.. ఎవరూ..?




అవంతిక: ఎవరు నువ్వు?

‘n’వ బాహుబలి: చెబుతాన్లేగానీ… అంతకన్నా ముందు నిన్నొకటడగాలి.

అవంతిక: ఆఁ..? (సహజమైన తన ప్రశ్నార్ధకమైన ముఖంతో)

‘n’వ బాహుబలి: నువ్వు.. ఎవరూ..? నేను చెప్పనా..? ఆ చింపిరి జుట్టు, చిరిగిన బట్టలు, చెమట కంపు, చీమిడి ముక్కు, పాచి పళ్ళు, ఎండిపోయిన పెదవులు, మెడలో ఆ పిచ్చి పూసలు… తప్పకుండా నువ్వు తప్పిపోయిన ఒక సెకండ్ జెనరేషన్ టార్జాన్ సుందరివయి ఉంటావు. ఆ చేతిలో కత్తి నీకు బొత్తిగా నప్పలేదు గానీ లెట్’స్ గో ఫర్ ఎ మేకోవర్ అండ్ దెన్ సింగ్ ఎ సాంగ్.

Monday, May 02, 2016

ఏంటీ..? నీకు అది లేదా?




ఎక్కడికెళ్ళినా ఇదే ప్రశ్న. వీధిలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి. ఇహ ఫ్రెండ్స్ ని కలిసినా కలీగ్స్ ని కలిసినా తలకొట్టేసినట్టుంటుంది. ఇంటికెళితే చివరికి అమ్మకూడా “పెళ్ళి కావలసిన పిల్లాడు, ఈ అవమాన భారం ఇంకెంతకాలం మోయనున్నాడో నా బిడ్డ. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా? నా పూజల్లో ఏలోపం జరిగిందో.. ఏమో? శిక్ష నా కొడుకు అనుభవిస్తున్నాడు. ఆపద్భాంధవా.. అనాధరక్షకా.. నా బిడ్డని ఆ లోప విముక్తుడ్ని చేసే భారం నీదే తండ్రీ” ఇన్ని డైలాగులు ఒకే ఒక్క దీనమైన ఎక్స్ ప్రెషన్ లో ఆవిడ చూపించిన క్షణాలెన్నో, అది తట్టుకోలేక తల నేలకేసి తిన్నగా తన గదిలోకెళ్ళి గడియపెట్టుకుని తడిపిన తలగడలింకెన్నో. ఏడ్చి ఏడ్చి అలిసిపోయి ఏదో దీర్ఘాలోచనలో అలా సీలింగ్ వైపు తీక్షణంగా చూస్తుండగా ఇంతలో కరెంటొచ్చి ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది. చల్లగాలికి కన్నీళ్ళైతే ఆవిరయ్యాయిగాని తన మనసులో ఆ లోపం తాలూకు ఆలోచనల సెగలు మాత్రం ఆరలేదు. మళ్ళీ కరెంటుపోయింది ఫాన్ ఆగింది. ఆగిన ఫ్యాన్ ఈసారి కిటికీలోంచి వచ్చే చిరుగాలికి ప్రతి 5 సెకండ్లకొక డిగ్రీ చొప్పున, మధ్య మధ్యలో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కి మరికొన్ని డిగ్రీల చొప్పున తిరుగుతుంటే తనతో ఏదో మాట్లాడుతున్నట్టనిపించింది. పరిపూర్ణమైన డిప్రెషన్లో ఉండటం వల్లో ఏమో అ మాటల్లో “ఉదయ్ కిరణ్, ప్రత్యూష బెనర్జీ, జియా ఖాన్” వీళ్ళ పేర్లు వినపడ్డాయ్. సీలింగ్ ఫ్యాన్లు బాన్ చెయ్యాలన్న రాఖీ సావంత్ మాట కాస్త ధైర్యాన్నిచ్చినా ఎవడి భయం వాడిది. అంతే ఒక్క ఉదుటున లేచి పరిగెత్తి హాల్లో ప్రమిదలకి ఒత్తులల్లుతున్న అమ్మని గట్టిగా కావలించుకుని అమ్మ కొంగంతా తడుపుతూ మొన్న నక్కాశీవారి వీధి రెండవ లైన్లో ఉన్న ‘నిత్యకళ్యాణి మ్యారేజ్ బ్యూరో’లో జరిగిన అవమానం గురించి చెప్పి ఘొల్లుమన్నాడు. ‘నిత్య కళ్యాణ్’ ఆ బ్రోకర్ వెధవ, వాడికింకా పెళ్ళికాలేదుకానీ ఊళ్ళోవాళ్లందరికీ సంభంధాలు చూస్తాడట. వచ్చిన ప్రతి ఆడపిల్లనీ ‘నువ్వేనా..? నాకు నువ్వేనా..?’ అన్నట్టు ఓరకంగా చూసి ఛస్తాడు కామాంధుడు. అలాగే వదిలేస్తే కొన్నాళ్ళకు మగపిల్లల్ని కూడా చూడక తప్పదు వెధవకి. పోయిన గురువారం రిజిస్ట్రేషనుకని వాడి దగ్గిరికెడితే నింపమని ఒక ఫాం చేతికిచ్చాడు. నాకు తెలిసినవి రాసిస్తే.. “ఏంటీ..? ఆ వివరం రాయలేదు? ఆ వివరం లేకుండా పిల్లనెతకడం కష్టం. ఇవాళా రేపు అమ్మాయిలు చాలా ఫాస్ట్. అన్నిటికన్నా ముందు అదుందో లేదో చూస్తున్నారు, వివరంగా ఉంటేనే అప్లికేషన్లు కన్సిడర్ చేస్తున్నారు. అయినా కనీసం అదికూడా లేని కుర్రాడ్ని నిన్నే చూస్తున్నా” అని వెటకారంగా నలుగురిలో పరువు తీశాడు. ఆ ఘటన గురించి విన్న వాళ్ళమ్మ తట్టుకోలేకపోయింది. వెంటనే కొడుకుని ఏడ్చిన మొహం కడుక్కుని పౌడర్ రాసుకుని తయారవ్వమని తనూ రెడీ అయింది. ఊళ్లోనే రంగుబజార్లో బొమ్మలబాబుగా పేరెన్నికగన్న నేటి మేటి ఫోటోగ్రాఫర్ సిరాజుద్దీన్ దగ్గరికి పట్టుకెళ్ళి వాడి చెవిలో ఏదో ఊదింది. వాడేమో వివరం చెప్పకండా తన చేత ‘నాలుగంకె వేస్తూ ఒకటి, థమ్సప్ చెప్పిస్తూ ఒకటి’ అలా అర్థంకాని భంగిమల్లో కొన్ని ఫొటోలు తీసి ఫోటోషాప్ లో పైమెరుగులుదిద్ది అవన్నీ ఒక USBలోకి కాపీచేసి వాళ్ళమ్మ చేతికిచ్చాడు. ఏంటమ్మా ఇదంతా..? అని ఎంత చెప్పినా వినకుండా..  “మారు మాట్లాడకు” అని అక్కడినుంచి తిన్నగా కోతిబొమ్మ సెంటర్లో ఉన్న ‘శ్రీ భ్రమరాంబిక నెట్ కెఫే’కి తీసుకెళ్ళి, USB వాడి చేతిలో పెట్టి వాడి కాళ్ళు పట్టుకుంది. “బాబ్బాబూ.. నీకు పుణ్యముంటుంది ఎలాకొలా నాకొడుక్కొక ఫెస్బుక్కెకౌంటు క్రియేట్ చేసిపెట్టు చచ్చి నీ కడుపున పుడతా.. నీ తల్లిలాంటిదాన్ని” అని వాడి వెళ్ళా, గోళ్ళా పడి ప్రాధేయపడింది. ఇన్నాళ్ళూ తల్లిదండ్రుల మాట గౌరవించి ఈ సామాజిక వలయాలకు దూరంగా బ్రతుకు వెళ్ళబుచ్చాడు నా కొడుకు. సమాజం వాడిని సోషల్లీ ఇనాక్టివ్ అని, ఇనర్ట్ అని, ఐసోలేటెడ్ అని ఇలా నానా మాటలు అంటుంటే కన్నకడుపు తరుక్కుపోతుంది బాబూ. అక్కడ నాకొడుకు ఒంటరి కాకూడదు నాకూ ఒక అకౌంటు క్రియేట్ చెయ్.. వాడికి ఫ్రెండ్ గా ఆడ్ చెయ్. ఓ వందిస్తాను నువ్వూ వాడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు. ఒరేయ్.. అబ్బాయిలూ తలా ఒక ముంత మసాలా ఇప్పిస్తాను నా కొడుక్కి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండర్రా అని ప్రతి క్యాబిన్ కి వెళ్లి ప్రాధేయపడింది. వెల్లికలా దిండుమీద తలపెట్టి పడుకున్నా వెనుకనుంచి ఎవరో చిన్న మెదడు చితికేలా క్యాట్బాల్ తో బెండుముక్కతో చాచిపెట్టి గెట్టిగా కొట్టినట్టనిపించి ఒక్కసారిగా మెలకువ వచ్చింది రాంబాబుకి. వాళ్ళమ్మని ఆపుదామంటే కాళ్ళూ చేతులూ ఎవరో మంచానికి కట్టేసినట్టనిపించింది. ఇది కలేమో అని అనిపించింది. అయితే బావుండనిపించింది. శరీరంలో మెదడు తప్ప ఏ అవయవం చెప్పిన మాట వింటున్నట్టు అనిపించలేదు. ఇహ చేసేదిలేక, నీ ఇష్టం నా పరువు బుగ్గిపాలే అని ఆ పీడకలలోంచి బయటకొచ్చే ప్రయత్నం వదిలేసుకున్నాడు. తరువాత కాసేపటికి నిజంగా మెలకువ వచ్చింది. వొళ్ళంతా చెమటతో ముద్దయింది. కరెంటు పోయి చాలాసేపయింది. వీధి లైట్లు పనిచేస్తున్నట్టున్నాయ్.. కిటికీలోంచి వెలుతురుకి ఆగిపోయిన సీలింగ్ ఫ్యాన్ కనిపించింది. లేవడానికింకో ప్రయత్నం చేశాడు. ఈ సారి ప్రయత్నం ఫలించింది. తలపట్టుకుని జరిగిందంతా జీర్ణించుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ప్రారంభించింది, కరెంటొచ్చింది. ఇహ ఆలశ్యం చేయదలుచుకోలేదు. వెంటనే లాప్టాప్ తెరిశాడు. ఎందుకో ఇంకా చెప్పాలా?

Saturday, March 19, 2016

బాబూ.. అఫ్రిదీ..




బాబూ.. అఫ్రిదీ..
వెధవది విధి HULK లాంటిది బాబూ.
ఎంతబలమైందో కామెంటరీ డబ్బాలో ఒకమూలకెళ్ళి కలిసి మెలిసి కన్నీళ్ళు పెట్టుకుంటున్న రిటైరైన మీ అన్నలనడుగు. “ఉందిగా సెప్టెంబరు మార్చిపైనా..” అన్నారు సినీ మహా కవి సిరివెన్నెల. మరి మీ క్రికెట్ ‘కపు’లేమన్నారో కనుక్కోనాయనా. “మనం ఎందుకోడిపోయ్యాం?” అని 11వ సారి తేలుకుట్టిన దొంగల్లాగా ఉప్పర మీటింగులవీ పెట్టుకోకుండా మమతా దీదీ మీకోసం స్పెషల్ బిర్యాని స్వయంగా చేసింది… అది తింటే ఈ బాధని మీరు అట్టే మర్చి’పోతారు. అన్నట్టు ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా చూశారా? పక్క ధియేటర్లో బెంగాలీలో ఆడుతుంది కుమ్మెయ్యండి. ఆట మొదలైన 15 నిమిషాల తరువాత మెలకువగా ఉన్నవారికి థియేటరువారు టికెట్ డబ్బు వాపసిస్తున్నారని టాక్. పాటిమన్నులాంటి మీ దేశభక్తి మిమ్మల్ని క్రుంగదీస్తే.. నాకు తెలిసి రేపు రాత్రికి JNUలో సంతాప సభ ఏర్పాటు చేసుంటారు మరి మీ ఓపిక(tolerance). "‘దేశ భక్తి’ అనగానేమి?" అనే విషయం మీద అక్కడ కొన్ని నెలలుగా ‘కూటములు’ నడుస్తున్నాయి. జ్ఞానస్వస్థతనొందుడి. ఈ ఓటమి వెనుక ‘నమో’ హస్తముందేమోనని మీ ISI వారిని ఆట్టే రక్తపోటు తెచ్చుకోవద్దని చెప్పు దానికి మా ఛోటూ, వాడి ‘మేతా’వులు ఉన్నారు ఖాళీగా..  

Saturday, March 12, 2016

॥ గజిబిజినీ ॥



        ఉన్నట్టుండి రాంబాబుకి సినిమాల్లో హీరో అయిపోవాలని కోరిక పుట్టింది. అయినా నిన్ను పెట్టి ఎవడ్రా సినిమా తీసేది తల మాసిన వెధవ? అనడిగితే.. తల మాయడానికి చాన్సులేని వాడే ఘోస్ట్ ప్రొడ్యూసర్ 'సత్య నాదెళ్ళ' అని చెప్పాడు. అవునా ఆయన్నేలా ఒప్పించావురా అంటే.. "చాలా సింపుల్ నా కధ 'గజినీ'కి రీమేక్ 'గజిబిజినీ'. అది 'భీభత్స'రస ప్రధానం, మనది 'హాస్య'రసభరితం. దానిలో గజినీ పచ్చబొట్టుతో ఒళ్ళంతా పేర్ల ముగ్గులేసుకుంటాడు. మనదాంట్లో అలాంటి చాదస్తానికి చాన్సులేదు. మనదంతా మోడ్రన్.. టెక్నాలజీ బేస్డ్. ఇందులో హీరో విండోస్ 10 ఫోనులో కోర్టాన సహాయంతో తన దైనందిన ప్రణాలికలు అమలుచేస్తుంటాడు." ఇప్పుడర్థమయింది సత్య నాదెళ్ళ ఎందుకు ఫైనాన్స్ చేస్తున్నాడో వీడి సినిమాకి. ఇంతకీ నాదెళ్ళకి చెప్పి ఒప్పించిన లైన్స్ ఏంటి?


        సినిమా ఓపెనింగ్ సీన్ లో హీరో ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా బోర్లా(సెన్సారు వారి యోగ క్షేమాలదృష్ట్యా) పడుకుని ఉంటాడు. మెడలో ఒక స్ట్రాప్ కి Microsoft Lumia 950 XL ఫోన్ వీపుపై మోగటానికి సిద్దంగా అప్పుడే డిస్ప్లే నీలం రంగులోకి మారుతుంది. మరుక్షణంలో... కోర్టానా: "గుడ్ మార్నింగ్ గజిబిజినీ.. నీ పైత్యానికి తెల్లవారింది. గుడ్ మార్నింగ్ గజిబిజినీ.. నీ పైత్యానికిక తెల్లవారింది." అని లూప్ లో మోగుతుంటుంది. కొన్ని పాక్షికంగా బ్లర్డ్ ఫ్రేమ్స్ తరువాత గజిబిజినీ ఫోన్ ని చేతిలోకి తీసుకుని.. 
"హాయ్.. కోర్టానా"
హాయ్ చీఫ్.. గుడ్ మార్నింగ్.. ఆస్క్ మీ ఎ క్వశ్చన్ 
"నేనెవరు.. నా పేరేంటి?"
నీ పేరు 'గజిబిజినీ'
"నేనెక్కడున్నాను?"
పగలో 
"నాకేమైంది? నాకేంటీ ఖర్మ?"
నీ ఖర్మ కాలింది. దానికెవరో అకారణంగా నిప్పంటించారు. 

ఈ నాలుగు లైన్లు విని బ్లాంకు చెక్కు మీద తన సంతకం చెక్కి సినిమా హిట్టయ్యాక కనిపించమన్నాడట 'నాదెళ్ళ'. నా వంతు ఉడతాసాయంగా నీకు ఓపెనింగ్ స్లైడు చేసిస్తానని క్రింది స్లైడు చేసిస్తున్నా... 

కథ, కథనం, సైగలు, మాటలు, పాటలు, పాట్లు, దర్శకుడు, ప్రేక్షకుడు. *.* 
రామ్ బాబు (మలి పరిచయం)


ఈ క్రింది జవాబులకు సరైన ప్రశ్న వ్రాయండి.




ఈ క్రింది జవాబులకు సరైన ప్రశ్న వ్రాయండి.

అ) బీర కాయ
ఆ) బెండ కాయ
ఇ) మిరప కాయ
ఈ) వం కాయ
ఉ) పైవేవీ కావు

Friday, March 11, 2016

॥ ఇస్తిరయ్యా వాయనం.. పుచ్చుకుంటిరయ్యా వాయనం ॥




        పెద్ద చదువులు చదువుకునే రోజుల్లో పుస్తకాలపైన పూర్తి పేరు రాయకుండా ఒక్క ‘U’ మాత్రం రకరకాల ఆకారాల్లో రాసుకునేవాడ్ని. పెద్ద చదువులంటే.. పేద్ద చదువులని కాదు, కాకపొతే చిన్నవాటికంటే కొంచెం పెద్దవన్నమాట. పుస్తకాల్లో అంతంత పొడవున పేర్లు రాయడం, అంతకన్నా పొడవుగా అండర్లైన్లు గీయడం, రంగురంగుల స్కెచ్చులతొ హైలైట్ చేయడం పుస్తకాలకుండే మానం, అభిమానం లాంటివి భంగం చేయడమేమోనని నా అభిప్రాయం. 
        ఏఁ.. ఆమ్లెట్లో గుడ్డుపెంకులు, ఖర్జూరంలో ఇసుక తగిలినట్లుందా? సరే.. కల్లుకొచ్చి ముంత దాయడమెందుకు అసలు విషయానికొచ్చేస్తా. వాస్తవమేంటంటే పాపం నా పుస్తకాలు చాలా మంచివి, మనసున్నవి. సెమిస్టరవ్వగానే ఓ వందో రెండొందలో చేతిలో పెడితే బస్సెక్కి పుట్టింటికెళ్ళి(కోఠీ), తరువాతి సెమిస్టరు పుస్తకాలని పంపించేవి. పిచ్చిగీతల్లాంటి చెత్త పనులుగానీ చెస్తే అలిగి చిత్తు కాగితాల కొట్టుకెళ్ళిపోయేవి పర్మనెంటుగా. 
        ఇంతకీ ఇంత ఉపోద్ఘాతమెందుకు ఎందుకిచ్చానంటే? ఒకసారి నాపేరులో ‘U’ తప్ప మిగతా అక్షరాలన్నీ దాడికొచ్చాయ్.. కలలో. వాటి జెండా, ఎజెండా ఏంటంటే వాటిని పూర్తిగా నల్లపూసలు చెసేశానని. వాటికి న్యాయం చేయకపోతే నిద్రపోనివ్వమని ఘెరావ్ చేశాయ్. మీలో అందరికి కాకపోయినా కొందరికైనా సందర్భాన్ని బట్టి తప్పకుండా న్యాయం చేస్తానని మాటిచ్చాకకానీ నిద్రపోనివ్వలేదు. వాటికిచ్చిన మాట నిలబెట్టుకుందామని రాగిణిని పెళ్లిచేసుకుని ‘R’కి సగం సీటిచ్చేశా(హృదయ సింహాసనంలో). నార్వే వచ్చి ‘N’కి నా చరిత్రలో కొన్ని పేజీలిచ్చా (చించి కాదు). పార్థు పుట్టాక ‘P’ని ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా. 
        నీళ్ళలో ఈతకొట్టడం రాకపోయినా భవసాగరాలు ఈదే పనిలో పడి మిగిలిన అక్షరాల మాట నిజంగా మర్చిపోయా. ఇంకేముంది ఈ సారి నాపేరులో లేని అక్షారాలు కూడా నామీద దాడికోచ్చాయి మా పరిస్థితేంటని.. మళ్ళీ కలలోనే. జిజ్ఞాస్ పుట్టాక నా పేరులో లేని అక్షరాల కోటాలోంచి ‘J’ని ఎత్తి రాగిణి ఒళ్ళో కూర్చోబెట్టా. ఇక ముందు ముందు దాడికి దిగినా, నాపై యుద్ధం ప్రకటించినా అందరికీ న్యాయంచేసే శారీరిక, మానసిక, ఆర్ధిక, సామాజిక ఇలా ఏరక-మైన ఓపికలు లేవని గెట్టిగా చెప్పేస్తా.. ఆ.. అంతే.
        అలాగే మన జంబూ ద్వీపంలో కూడా పాపం వీళ్ళకసలు నోరులేదని కొందరికి, ఉండి అరిచినా వినిపించేటంత సంఖ్య లేరని కొందరికి, అరిచారని కొందరికి, అరాచకించారని ఇంకొందరికి అలా ఇచ్చుకుపోతున్నారు. ఇస్తిరయ్యా వాయనం.. పుచ్చుకుంటిరయ్యా వాయనం. 
        వాయనం ఏంటో తెలియని వాళ్ళుంటే చెప్పండి? ఇస్తా.. మీకు తప్పకుండా ఇస్తా.

Tuesday, March 08, 2016

తను ‘వెచ్చ’నంటా..




“పూలనే… కునుకేయమంటా…
తను ‘వచ్చె’నంటా.. తను వచ్చె’వెంటా’
తను ‘వెచ్చ’నంటా..
తను’విచ్చె’నంటా.. ‘తనువిచ్చె’నంటా.. “
        ఇలా కలలో ఒక అబలని ఎడా పెడా ఇబ్బందిపెట్టే పనిలో బిజీగా బిజీగా ఉండగా నిజంగానే రాంబాబుకి లుంగీలో తనువంతా వెచ్చగా స్పృశించసాగింది. లేచి చూసుకుంటే.. కంగారు పడవలసినంత విషయమేమీ కాదు. డైపర్ మానేయడం అలవాటు చేసుకుంటున్న వాళ్ళ చంటోడు ఎప్పుడొచ్చి పడుకున్నాడో తన బొజ్జమీద.. వెధవకి ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునే అలవాటు.. వాడికి తెల్లవారింది అంతే.
        తడిచింది లంగా కాదు లుంగీ, వెళ్లి వాడికి మార్చి మీరూ మార్చుకురండి ‘లుంగీ’ - అంది చాలా క్లియర్ వాయిస్ లో A.కాంతం. చలికాలం అందునా చలిదేశంలో బావ బావమరిది సినిమాలో సిల్కు వాయిస్లా ఉండాల్సిన కాంతం వాయిస్ భారతనారి సినిమాలో విజయశాంతికి డబ్బింగ్ చెప్పిన సరిత వాయిస్లా ఉండేప్పటికి, చర్చలకిది సరైన సమయం కాదని గ్రహించి తక్షణమే కార్యోన్ముఖు'డై'య్యాడు.

Monday, March 07, 2016

ఆజన్మ వైరం





నా చిన్నప్పుడు నా కాళ్ళ బొటన వేళ్ళకి మా ఇంటి గడపలకి బొత్తిగా పడేది కాదు. అస్తమానం కొట్లాటే. అప్పటికీ మా నాన్న చెబుతూనే ఉండేవాడు లోపలిగుమ్మాలే కదా అరంగుళం చాలురా అని. అయినా వినిపించుకోకుండా ఆరంగుళాలు పెట్టేశాడు ఆ అర'వం'డ్రంగి.ఒకసారి ఇలాగే ఒక పెద్ద కొట్లాటయింది వాళ్ళిద్దరికీ. గుమ్మానికి పెద్దగా దెబ్బలేమీ తగలలేదు కానీ నా కుడికాలు బొటనవేలుకి మాత్రం పుచ్చలేచిపోయింది, అక్కడికక్కడే రక్తం కక్కేసింది. మా అమ్మ అప్పటికీ సాంప్రదాయబద్ధంగా నిండా పసుపు రాసి ముత్తైదువులా అలంకరిస్తానన్నా మా నాన్నే వినకుండా దాన్ని ఆసుపత్రిపాలు చేసి తెల్ల బట్టలు కట్టించి విధవని చేసిమరీ ఇంటికి తెచ్చాడు. దాని భాధ చూడలేక నేనూ దానితో కన్నీళ్ళతోపాటు మధ్య మధ్యలో ఎక్కిళ్ళు కూడా పెట్టుకున్నాను.అలా మేమిద్దరం కలిసి మెలిసి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి, ఎందుకంటే అందరం ఒకే ప్రాణంగా బ్రతికేవాళ్ళం.

Thursday, January 14, 2016

॥ గొబ్బెమ్మలతో సెల్ఫీ ॥







ఒరేయ్ రాంబాబూ... మరీ పైత్యం కాకపోతే భోగిమంటలతో సెల్ఫీ ఏంటిరా నీ పాసుగాల. ఆ వెనుక అమ్మాయెవర్రా.. జుట్టు అంటుకుంటుందేమో జాగ్రత్త అని చెప్పు, తల ఆరబెట్టుకోవడానికి భోగిమంటల్లో సెల్ఫీ తీయించుకోవక్కర్లేదు. ఆ ముందు వరసలో ఆ గొబ్బెమ్మపాణి ఎవడ్రా.. ఎంతమాత్రం ఆర్టిఫీషియల్ ఆవు పేడ అయితే మాత్రం గొబ్బెమ్మలతో సెల్ఫీ ఏంటిరా.. మా ఖర్మ కాకపోతే. అయినా ఆ ఫొటో ఫేస్బుక్లో పెట్టేదాకా బతికున్నావ్ అదే సంతోషం.
'ఫేస్బుక్కు + సెల్ఫీ' ఒక డెడ్లీ కాంబినేషన్ అనే విషయం ఇవాళ మరోసారి ఋజువయింది. ఈ సృష్టిలో అణుబాంబు తరువాత మనిషి కనుక్కున్న అతిప్రమాదకరమైన విషయం ఈ సెల్ఫీనే.. అనిపిస్తుంది కొన్ని ఫొటోలని చూస్తుంటే.
సరిసర్లే.. ఆందరికి భోగి పండుగ శుభాకాంక్షలని చెప్పు ♣

Saturday, January 09, 2016

వలస చీమలు The Expa(n)ts





ఏఁవండీ.. ఏంటీ మన పైవాటాలోకి ఎవరో ఒక కొత్త జంట దిగినట్టున్నారు? ఒకటే ఇకఇకలు పకపకలు.” 
ఇవి మాఆవిడ మాటలు కాదండీ బాబు. మా రాంబాబుగాడి స్టోర్ రూంలో పల్లీడబ్బాలో గత 6 నెలలుగా కాపురముంటున్న ఒక చీమల జంట మాటలు. వాటి పై షెల్ఫ్ లో కొత్తగా దిగిన జంటకూడా చీమలే. అప్పుడే వీకెండ్ పార్టీనుండి తిరిగొచ్చిన కొత్త జంట ఇకపకల సంభాషణ సారాంశం ఇదే.
.చీ.:- ఏఁవోయ్.. ఏంటీ ఇది మన ఇడ్లీరవ్వేనా..? ఇంత తియ్యగా ఉంది?

.చీ.:- ఏఁవండోయ్.. బై లక్ మనం దారి తప్పి పక్క షెల్ఫ్ లో ఉన్న పంచదార డబ్బాలోకి వచ్చి చేరాం.. కేవలం నువ్వు.. నేను.. అయ్యబాబోయ్.. ఐ యాం ఎక్సైటేడ్.

.చీ.:- అదేంటీ మనం ఇండియా నుంచి వచ్చింది ఇడ్లీ రవ్వలో కదా? ఈ దరిద్రుడు ఇండియా నుంచి చివరికి పంచదార కూడా తెచ్చుకుంటున్నాడా? అలా అని తెలిస్తే మా బామ్మర్దిగాడ్ని కూడా వెంటపెట్టుకొద్దునుగదా.. ఖర్మ.

.చీ.:-  ఈ పంచదార చూడబోతే సుగర్ బీట్స్ నుంచి తీసినట్టున్నారు. కాబట్టి ఇండియా నుంచి తేవడానికి చాన్స్ లేదు. మీరు ప్రతిదానికీ అలా అనుమానించకండి పాపం రాంబాబు గారిని.

.చీ.:- అన్నట్టు నిన్న జాగింకెళ్ళొస్తుంటే కింద పోర్షన్(పల్లీ డబ్బా)లో ఎవరో మనలాగే Expats ఉన్నట్టున్నారు, పలకరించావా?
.చీ.:- వాళ్ళదీ మన భాషే కానీ యాస వేరు.
.చీ.:- ప్రపంచమంతా గ్లోబలైజేషన్ పాట పాడుతుంటే, ఏడు సముద్రాలు దాటొచ్చినా నువ్వింకా భాష, యాస పట్టుకుని వేళ్ళాడుతుంటే ఇహ మనకి పంచదార కాదు ఇసుకదార కూడా దొరకదు జాగ్రత్త ♣

Wednesday, January 06, 2016

॥ ఒలావ్ – పలావ్ ॥




      సరిగ్గా 20 ఏళ్ళక్రితం ఇలాగే నార్వేలో జనం దాదాపుగా మంచురహిత క్రిస్మస్ జరుపుకుంటున్న రోజులవి. చరిత్రకారులు చరిత్రని పుస్తకాల్లో రాయడం మానేసి వికీపీడియాల్లో నమోదు చేయడం మొదలుపెడుతున్న రోజులు కూడా అవే. అలాంటి రోజుల్లో ఒకరోజు క్రిస్మస్ పార్టీ నుంచి అప్పుడే బయట పడ్డాడు ‘తూరా’. అందరూ పీకలదాకా తాగుతుంటే మనవాడు రెండు పింట్లు ఎక్కువగా అంటే కళ్ళు మునిగే దాకా(మత్తులో) తాగాడు. మగువల తెగువలు తగవులకి దారితీస్తుంటే తగని వాడినని తెలుసుకుని జాకెట్టు, వాలెట్టు కూడా మర్చిపోయి కేవలం శీలంతో బయట పడ్డాడు మన అభినవ నార్వే రాముడు ‘తూరా’. అవును మనవాడు నిజంగా తూ’రాముడే. సీత మనసుతో పాటు జనకుడిని కూడా దోచుకున్నాడు. ఛ..ఛ.. మీరనుకుంటున్నట్టు కట్నకానుకలతో కాదండి. జనకుడి’ది’ (కూడా మనసే) అనబోయి అలా అచ్చుతప్పు. కావాలంటే రెండు వాక్యాలు వెనక్కెళ్ళండి. సో.. అలా తెల్లవారుఝామున 3 గంటలకు వీధిన పడ్డ మన తూరాముడికి హనుమంతుడిలా తారసపడ్డాడు ‘షఫీ’యుద్దీన్. షఫీ పాకిస్తానీయుడు. పొరుగు దేశంలో అంతా సాఫ్టు’వేరు’ పట్టుకుని దేశాలుపడుతుంటే మేము వేర్వేరు అంటూ డ్రై’వేరై’ నార్వే పట్టాడు. అప్పుడప్పుడే నార్వేలో పూసిన ఆయిల్ పూల సువాసన పాకిస్తానీయులు ఆఘ్రాణం చేసుకుంటున్న రోజులవి. ఏది వేరు ఏది చెట్టు ఐతేనేం ‘షఫీ’ అల్లా పెంచిన వెన్నెల తోటలో మనసు చెట్టుకు పూసిన మల్లె పూవు లాంటి తెల్లని మనసున్నవాడు. మన తూరాకి తన జాకెట్టిచ్చి ఇంటి దగ్గర దింపి తన ఇంటికెళ్ళి కారు 3 సార్లు కడుక్కుని కూడా ఒక్క ఓరె కూడా అదనంగా చార్జ్ చెయ్యలేదు. 3 రోజుల తరువాత మన తూరాముడు యోగనిద్ర నుండి బయటపడ్డాడు. గతజన్మ రహస్యం తెలుసుకున్న తమిళ హీరోలా వెంటనే షఫీకి ఫోన్ చేసి యాదోం కి బారాత్ టైటిల్ సాంగ్ bgm తో క్షమాపణలు చెప్పి, కష్టనష్టాలు అడిగి, పడవ ప్రమాదంలో చిన్నప్పుడు తప్పిపోయిన తమ్ముడిలా ఫీల్ అయి సకుటుంబ సపరివార సమేతంగా ఒకసారి మీరంతా మాఇంట్లో చేతులు కడగాలి అని ఒత్తిడి చేశాడు. బేగం కరీమాతో మాట్లాడి, హలాల్ జాగ్రత్తలు కూడా చెప్పిమరీ ‘ఠీక్ హై’ అన్నాడు షఫీ.
        కట్ చేస్తే డిన్నర్ టేబుల్ మీద ఎదురెదురు వరుసల్లో తూరా – షఫీ కుటుంబాలు. (మీద అంటే పైన అని కాదు టేబుల్ కి అటు ఇటు వరుసల్లో అని చదువుకోవాలి). టేబుల్ కి ఒక చివర మన ‘అపూర్వ సహోదరులు’ తూరా – షఫీలైతే మధ్యలో తీరా – కరీమా ఉంటే మరో చివరలో మన కథానాయకా, నాయికలు ఒలావ్, ఉమ్రావ్ లు కూర్చున్నారు. తొందరపడి మనసులో మీరొక డ్యూయెట్ వేసుకోకండి. అప్పటికి ఒలావ్ కి 13, ఉమ్రావ్కి 10, వేళ్ళు కాదు ఏళ్ళు. ఫుడ్ ఎంత బావుందో ఉమ్రావ్ మోహంలో కనపడింది మన ఒలావ్ కి. అప్పుడే ఫుట్ బాల్ మాచ్ నుంచి వచ్చినట్టున్నాడు ఒలావ్, పరశురాముడై విజృంభించాడు. ఆ సాయంత్రం ఎలాంటి అవాంఛనీయ ఉద్విగ్నభరిత సంఘటనలు లేకుండా ఒక కొలిక్కొచ్చింది. వెళుతూ వెళుతూ.. ఓ సారి మీరు కూడా భోజనానికి రావాలి ఒదిన గారు అన్నట్టు చెప్పింది కరీమా.. మొక్కుబడిగా. పాపం ఉమ్రావ్ మాత్రం అందరిలో చాలా ఒంటరిగా ఫీలయింది ఆ సాయంత్రం.
        అన్నట్టు ఉమ్రావ్ కి కూడా ఒక పిట్టకథ ఉందండి. మన షఫీ జీవితంలో యవ్వనం వెర్రి మొగ్గలేస్తున్న రోజుల్లో బాలీవుడ్ నాయకి రేఖకి వీరాభిమాని. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని మంకుపట్టు పట్టికూర్చున్నాడు. ఉమ్రావ్ జాన్ సినిమా విడుదలై వారం రోజులు. కుర్రకారంతా క్రికెట్ గ్రౌండ్ లో పోగై ఆమెపై గాసిప్పుల నిప్పులు చెరుగుతున్న రోజులు. అందునా అవి పైరసీ వీడియో క్యాసెట్లు సరిహద్దులు దాటుతున్నరోజులు. పెళ్ళీ పెటాకులు లేకుండా తిరుగుతున్న షఫీకి ముందు రోజు ఉమ్రావ్ జాన్ పైరసీ క్యాసెట్టు తెచ్చిచ్చి మర్నాడు కరీమాకి అదే గెటప్ వేయించి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టించాడు వాళ్ళ అబ్బాజాన్. ఇంకేముంది అడ్డంగా బుక్ అయిన సంగతి మూడు రాత్రులూ గడిచాకగానీ బోధపడలేదు పురుషుడికి. మర్నాడు పేపర్లో మేకప్ లేకుండా ఉన్న రేఖ ఫోటోని చూసి వేసిన గుటకకి నోట్లో ఉన్న చూయింగ్ గమ్ గుటుక్కున లోపలికిపోయింది. అంతే మర్నాడు చూయింగ్ గమ్ తో పాటే రేఖపై మనసు కూడా పోయింది. ఎందుకో పెళ్లి ఫోటోల్లో మేకప్ తో ఉన్న కరీమానే అందంగా కనిపించసాగింది షఫీకి. కట్ చేస్తే 9 నెలల తరువాత ఒక చేతిలో బేబీ ఉమ్రావ్ ని పెట్టింది కరీమా, ఇంకో చేతిలో నార్వే వీసా పెట్టాడు పోస్ట్ మాన్. ఆనందంతో గాల్లో తేలాడు షఫీ విమానంలో.
        సహపంక్తి భోజనాల్లో చివరాఖర్లో కూర్చుని ‘ఏవండీ.. మాకింకా లడ్డూ రాలేదిక్కడ’ అని అరిచే షుగర్ పేషంట్ లాగా, టైటిల్లో చెప్పిన పలావింకా రాలేదని కంగారు పడుతున్నారా? వస్తున్నా.. తెస్తున్నా..
        ఓకే.. మన కథలో మెయిన్ ట్రాక్ కరీమా కౌంటర్ ఇన్విటేషన్ దగ్గర ఆగింది కదా. అలా పిలవగా పిలవగా ఒక ఇఫ్తారు విందుకి రాక తప్పలేదు మన తీరా-తూరాముల కుటుంబానికి. మునుపెన్నడూ ఇలాంటి అనుభవం లేని మన ఒలావ్ కి ఆ దక్షిణాసియా సుగంధ ద్రవ్యాల సువాసనకి గుమ్మంలోనే మైకం కమ్మినట్టయింది. మళ్ళీ కట్ చేస్తే టేబుల్ మీద అదే ప్యాటర్న్ లో తూరా – షఫీ ల కుటుంబాలు, కాకపొతే టేబుల్ మీద కంటెంటే మారింది. అది ఒలావ్ మీద అనుకోని ప్రభావం చూపింది. ఈసారి ఎదురుగా ఉన్న ఉమ్రావ్ ఉనికి కూడా తెలియలేదు అతగాడికి. ఇజ్నిక్ సిరామిక్ ప్లేట్లో వేడి వేడి పలావ్ వడ్డించింది కరీమా. ఆ ప్లేట్ వంక చూస్తుంటేనే ఒక ఆర్ట్ ఫార్మ్ లా అనిపించింది. ఎటు పట్టుకోవాలో? ఎటు పెట్టుకొవాలో?(నోట్లో) కూడా అర్థంకానంత అందంగా ఉన్నాయి ఆ చెంచాలు. బంగారు తీగల్లాంటి బాస్మతి రైస్, సెలయేళ్ళు ఏళ్లతరపడి కడిగి, సాన పెట్టిన సుతిమెత్తని సున్నపురాతి పిక్కల్లాంటి జీడిపప్పు, అక్కడక్కడా ఉడికిన ముత్యాల్లాంటి కిస్మిస్లు, కన్నెఎంకి ముక్కుపుడకల్లాంటి లవంగాలు, పండిన సంపంగి రేకుల్లాంటి జాపత్రి, ఎండి రాలిపడిన నక్షత్రల్లాంటి అనాసపువ్వులు, తంజావూరు తామ్ర పత్రాల్లాంటి బేయాకులు… ఇలా మెదడు వర్ణిస్తూ పోతుండగా చేతులు, నోరు వాటి పని అవి చర చరా చేసుకుపోతున్నాయి ఒలావ్ కి. అంతే సృష్టిలో ఉన్న భాషలేవీ వర్ణించలేని ఆ అనుభూతికి లోనై అక్కడే పడ్డాడు ప్రేమలో మన ఒలావ్, ఉమ్రావ్ తో కాదు పలావ్తో. నిజ్జంగా పలావ్ తోనే. ఆ తరువాత అలవాటులేని మసాలాలు కడుపులో చేసిన అల్లరికి రెండు రోజులు గృహనిర్భందం కాకతప్పలేదు. అయినా జిహ్వ జయించింది. ఎప్పుడెప్పుడు ఉమ్రావ్ వాళ్ళింటికెళదామా కరీమా చేత్తో పలావ్ వండించుకు తిందామా అని అక్కడికి ఇక్కడికి చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు.
        మరి చిన్నప్పటినుండి పైరేటెడ్ సీడీల్లో బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగిని ఉమ్రావ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలానే అర్థం చేసుకుంది. అంతే ఒలావ్ లో ‘రాహుల్’ని చూసింది, పడింది. ఐ మీన్ మనసు పడింది. ఒలావ్ ని కూడా నెట్టింది. అంతే మనవాడి పులావ్ కి ఉమ్రావ్ తోడయింది. కాలం గడుస్తోంది.
        ఈ తంతు మొత్తానికి మూల స్త్రీ అయిన కరీమాకి విషయం బోధపడటానికి అట్టే సమయం పట్టింది. ఇంట్లో ఈడుకొచ్చిన పిల్ల ఉన్న సంగతి, అలాగే తోరా ఇంట్లో జోడుకొచ్చిన పిల్లాడున్నసంగతి షఫీకి గుర్తుచేసింది. కరీమా మనసులో మాట అర్థంకానట్టు నీకేమైనా అర్థమయిందా అని తూరాని అడిగేసాడు షఫీ. తీరాకేమైనా అర్థమవుతుందేమో అడిగి చెప్తా అన్నాడు తూరా. ఈ చైను ఇలా కంటిన్యూ అయ్యేలోపు మీకసలువిషయం అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపొతే కథ మొదటినుంచి చదవండి. కట్ చేస్తే అహ్మదీయ సాంప్రదాయంలో గ్రోన్లాండ్ మసీదులో ఇద్దరిచేత మూడు సార్లు కుబూలించారు పెద్దలు. పాక్-పశ్చిమాల ('పా' కింద 'ర' వత్తు సైలెంట్) మేలు కలయిక అని నార్వేయంలో గొణుక్కున్నారు అతిధులు.
        మళ్ళీ కట్ చేస్తే అవే మంచురహిత క్రిస్మస్ రోజులు. పైరేటెడ్ సినిమాలు చూసే అలవాటు లేని ఒలావ్, బేగం ఉమ్రావ్ తో కలిసి క్లింగేబెర్గ్ షినోలో ‘బాజీరావ్ మస్తాని’ సినిమాకెళ్ళారు. వాళ్లింకా దియేటర్లోంచి బయటికి రాలేదు వచ్చాక చెబుతా తరువాత ఏమయిందో.

॥ అవకాశవాణి ॥



1850_933287836758388_9019207182854152328_n

        అవకాశవాణి, ఓస్లో కేంద్రం. నూట మూడు పాయింట్ రెండు మెగా హెర్ట్జ్ పై తెలుగు ప్రసారాలు వింటున్నారు. ఇప్పటి వరకు మీరు ‘చలికాలం – చంటిపిల్లలు’ శీర్షికన మంచుదేశాల్లో చలికాలంలో పసిపిల్లల్లో వచ్చే శారీరిక, మానసిక ఋగ్మతలు వాటి నివారణ గురించి డా.యెన్స్ ఓలావ్ బర్గ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. శ్రోతల సౌకర్యార్థం ఈ కార్యక్రమం యొక్క podcast అవకాశవాణి అంతర్జాల ముఖపుటలో రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి అందుబాటులో ఉంటుంది.
        తరువాతి కార్యక్రమం తరువాత వింటారు. ఇప్పుడు ‘నార్వీజియన్ ఉన్నత విద్య – Russ సంస్కృతి – సామాజిక పరివర్తన’ గురించి Bergen విశ్వవిద్యాలయ ఆచార్యులు, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డా.Pitch Reddy Munch Reddy గారితో ఇష్టా-గోష్టి. పాల్గొంటున్నవారు ఓస్లో విశ్వవిద్యాలయ విద్యార్థిని విద్యార్థులు.
హర్షించాలి కొన్ని తెలిసిన సామాజిక కారణాల వల్ల ప్రకటించిన కార్యక్రమం క్రమంలో వేయలేనందుకు సంతోషిస్తున్నాం. ఇప్పుడు ‘భక్తిరంజని’ శీర్షికన క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఓస్లో కాథలిక్కు ప్రార్థనా మందిరంలో మయూస్తువా శిశువనం చిన్నారులు ఆలపించిన కొన్ని భక్తి గీతాలు వింటారు.

……♩♪♫♬♩♪♫♬♩♪♫♬……..
        అవకాశవాణి, ఓస్లో కేంద్రం. ఈనాటి సాయంకాలం ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మెగా హెర్ట్జ్ పై ‘ఉదయరంజని’ కార్యక్రమంతో పునః ప్రసారం ప్రారంభం. అంతవరకూ శెలవు. హాదేబ్ర.

(రా)క్షురకుడికి వినతి పత్రం



barber

        గౌరవప్రియమైన బార్బరు బాబు గారికి, వచ్చే శనివారం నిర్ణయింపబడిన, తమరి పవిత్రమైన చేతుల మీదగా నిర్వహింపబడే నా ద్వైమాసిక క్షవర కార్యక్రమాన్ని పురస్కరించుకుని.. పూర్వానుభవం వలన కలిగిన అపూర్వమైన భయంతో కూడిన.. నా భవిష్యత్ పరువుపై గల బాధ్యతతో కలిగిన ముందుచూపుతో మీకు సమర్పించు వినతి పత్రం.
        సరిగ్గా రెండు నెలల క్రితం నా తలపై మీ కత్తెర చేసిన అల్లరి తాలూకు చిటపటలు ఇప్పటికీ నా చెవుల్లో తౌజండ్ వాలాలో సీమటపాకాయల్లా మార్మోగుతూనేవున్నాయి. వచ్చిన ప్రతిసారీ ‘ఈ సారి మీరు ఎలాంటి స్టైలు కోరుకుంటున్నారు?’ అని తమరు సౌమ్యంగా నార్వేయంలో అడగటం, తెలుగునుంచి ఆంగ్లీకరించిన నార్వేయంలో తడి కళ్ళతో, పొడి పొడి మాటలకు నా సంజ్ఞలు జోడించి దశాబ్దాలుగా ఔపోసన పట్టిన నా శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని నా కోరికల చిట్టా పూర్తిగా విప్పకముందే మీరు అంతా అర్థమైందన్నట్టు ‘ఓకే.. ఓకే’ అంటూ ముందుకు దూసుకుపోవడం, కళ్ళు మూసి తెరిచేలోపే తలపై జుట్టంతా చుట్టూ చెల్లాచెదురు అయిపోవటం, ఎదురుగా అద్దంలో ఇప్పటివరకు ఉన్న మనిషి అకస్మాత్తుగా మాయమవటం నాకు షరా మామూలైపోయింది. పైగా చివరలో ఓ అద్దం తెచ్చి నా వెనుక అన్ని కోణాల్లో చుట్టూ తిప్పుతూ మీరు ‘హవీజిట్..? హవీజిట్..?’ అంటుంటే నాకు నా హెయిర్ స్టైల్లో ‘హెయిర్’ ‘వేరీజిట్..? వేరీజిట్..?’ అన్నట్టు వినిపిస్తుంటుంది. మీ పుణ్యమా అని సెలూన్ కి వచ్చిన ప్రతిసారి మా ఇంటికి ఒక కొత్తదారి కనిపెట్టవలసి వస్తుంది. ఎలాగోలా ఇల్లుచేరితే ఇల్లాలు నాలుగు సెక్యూరిటీ క్వశ్చన్స్(అందులో మా ఎంగేజ్మెంట్ డేట్ ఒకటి) అడిగిగానీ ఇంట్లోకి రానివ్వటంలేదు. ఇహ మా చంటోడైతే కనీసం వారం రోజులు నా దెగ్గిరికి రాలేదంటే మీరు నమ్మరు. ముందుచూపుతో పరువు కోసం ఆ వారం రోజులు ఆఫీసుకి శెలవు పెట్టవలసి వచ్చింది. వచ్చే క్రిస్మస్ శెలవల buffer time దృష్టిలో ఉంచుకుని ఈ విడిత ప్లాన్ చేయడం జరిగింది.
        శిశిరంలోనే ఆకులు రాలటం అనేది జగమెరిగిన సత్యం. కాని తలపై జుట్టుకు మాత్రం 365 రోజులూ శిశిరమే అన్న విషయం కేవలం నార్వే యెరిగిన సత్యం. అందుకే నాకు తలసరి వెంట్రుక ఖర్చు(maintenance cost per hair) పెరిగిపోతోందని మనవి. ఇక్కడి ఒక తడవ క్షవరం ఖర్చుతో స్వదేశంలో కనీసం 2 సంవత్సరాల క్షవరం బడ్జెట్ (అదనపు సేవలతో కలిపి) వేయవచ్చు. అందుకే నార్వేలో ధనవంతులంతా బార్బర్లైనా కావచ్చు లేదా బట్టతల గలవాళ్ళయినా కావచ్చునని నా అభిప్రాయం. మరి మీరేమో బట్టతల బార్బరు. ఈ ఆర్ధిక మాంద్యంలో మీ ఆర్ధికస్థితి గురించి ఆలోచిస్తే అసూయగా ఉంది.
        చివరగా నా భవిష్యత్ పరువు, మర్యాద, గౌరవ, సుఖ శాంతులు ఈ శనివారం తరువాత ఒక కొత్త అధ్యాయంలోకి, కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి. వాటికి మీ పూర్తి సహాయ సహకారాలుండాలని ఈ నా వినతి.

Christmas Party for Dummies



Chicken

        ఓసారి.. సమశీతోష్ణమండలంలో ఒక ప్రాంతంలో.. ఓ శీతాకాలంలో.. ఒక లేడీకోడి తన జెంట్ జంటకోడితో కలిసి బాగా పొద్దెక్కాక వ్యాహ్యాళికి బయలుదేరింది. అలా కొన్ని సెంటీమీటర్లు కలిసి నడిచాక.. లేడీకోడి మెల్లగా తన మనసులో మాట ఇలా బయటపెట్టింది.
లే.కో. :- వాట్ డియర్.. ప్రొద్దుట్నించి ఫోన్ చేస్తుంటే కనీసం ఒక్కసారి కూడ ఆన్సర్ చెయ్యలేదూ.. ఏమ్మా కోపమా.. అలకా..
జె.కో. :- హ్యాంగోవర్.. అవును డియర్.. నిన్న మా ఆఫీసులో క్రిస్మస్ పార్టీ. నీకుప్రత్యేకంగా తెలియందేముంది ఒక్క క్రిస్మస్ పార్టీ ఎంతటి ప్రతిభావంతుల్నైనా ఎంత ప్రభావితం చేస్తుందో..
లే.కో. :- అంటే.. నిన్న రాత్రి పార్టీలో.. తమరు ఒక తోక కాలిని కోతి అవతారమెత్తారన్నమాట
జె.కో. :- దాదాపుగా అలాంటిదే.. కానీ డియర్.. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఫుడ్డు మాత్రం అమోఘం, అద్వితీయం. ఎన్నో రకాల దినుసులు, సెరియల్స్, కనీ వినీ ఎరుగని రకరకాల పురుగులు వాటితో వంటకాలు. అబ్బో వర్ణనాతీతం. డ్రింక్స్ విషయానికొస్తే.. ఇహ మంచినీళ్ళడిగినా ‘విత్ ఆర్ వితౌట్ మత్తా సార్’ అంటున్నారంటే నమ్ము. అది చెప్పేది కాదు జీవితంలో ఓసారి అనుభవించి తీరాల్సిందే. డార్లింగ్.. మన పెళ్ళిలో కూడా ఇదే మెను కనీసం రిపీట్ చేయగలిగితే చాలు చరిత్ర సృష్టించినట్టే.
లే.కో. :- పో డార్లింగ్.. మనకప్పుడే పెళ్ళేంటి. ఆ మాట వింటుంటేనే సిగ్గేసేలా ఉంది.
జె.కో. :- చాలు చాల్లే.. నువ్విలా మరీ సిగ్గుపడకు.. పెళ్ళికి ముందే గుడ్డు పెట్టెయ్యగలవ్
లే.కో. :- సరి సర్లే.. నీ వెధవ వేళాకోళం నువ్వూను. ఇంకా చెప్పు.. అయితే ఫుడ్డు కొంచెంకూడా మిగల్లేదన్నమాట చివరికి
జె.కో. :- పిచ్చి మొహమా.. ‘Food is God’ when you pay for it. Free food కి ఆ సూక్తి వర్తించదు.
లే.కో. :- అంటే..
జె.కో. :- అన్నా అనకపోయినా.. మన కోళ్ళ టేబుల్ మేనర్స్ గురించి నీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా..? అందునా మత్తెక్కిన కోళ్ళ సంగతి. ప్రతి టేబుల్ ఒక మోడ్రన్ ఆర్ట్ కాన్వాస్ అంటే నమ్ము. అందునా గెలకటం, బరకటం లాంటి పనుల్లో ఎన్నో పేటెంట్లు మన వాళ్ళ సొంతం కదా.
లే.కో. :- మరి డాన్సులు గట్రా..?
జె.కో. :- అబ్బో.. దానిమీదైతే ఒక ఖండకావ్యం రాయొచ్చు. డాన్స్ ఫ్లోరంతా ఈకలమయం. ఒక్కొక్కడు గాల్లోకి ఎగిరెగిరి రెక్కలతో హై ఫైవ్ లు కొట్టడం. కన్నుల పండుగ అంటే ఇదేనేమో. నాకు 10 ఈకలు ఊడి పోయాయని ఒకడు, నాకు 20 అని మరొకడు. నాకు మొత్తం ఊడిపోయయి ఇంటికెళితే నన్ను ఎవ్వరూ గుర్తుపట్టరేమో అని ఇంకొకడు. వాళ్ళు కాదు ముందు వీడు ఇకొకర్ని గుర్తుపట్టే పరిస్థితిలో లేడు. అవునూ.. ఇందాకట్నుంచి నా గురించే చెప్పి బోర్ కొట్టిస్తున్నానా..?
లే.కో. :- అదేం లేదు డియర్.. నెక్స్ట్ వీకెండ్ మా ఆఫీసులో క్రిస్మస్ పార్టీ ఉంది. ‘క్రిస్మస్ పార్టీ ఫర్ డమ్మీస్’ లాగా నీ ఎపిసోడ్ బాగా ఉపయోగపడింది. ఉంటా మరి బై బై.

వినర మామా!



12308643_918481021572403_4234711655044262771_n

ఆమీర్ ఖాను చూడ అందముగనుండు
మనసు విప్పి చూడ మతోన్మాదముండు
మొన్న నోరు విప్పె చూడు వేర్పాటువాదము మెండు
తెరపై నాయకులంతా తెరచాటు ప్రతినాయకులేనయా
విశ్వదాభిరామ వినురవేమా

Black Friday (in Norway)



12310653_918966284857210_7453530613690539752_n

        ఉత్తర ధృవ దేశంలో కార్తీక మాసంలో వచ్చే కాళ వారం చాలా ప్రశస్తమైనది. అందునా ఐదవ రోజైన కాళ శుక్రవారం వినియోగదారునికి అతిప్రీతిపాత్రమైనది. ఈరోజు కొనుగోలుదారుడు వేయి కళ్ళు, వేల వేల చేతులతో (కాని ఒక్కటే జేబు) ఎంతోమంది హిందూ దేవతలు సైతం అసూయపడేవిధంగా తన విశ్వరూపం చూపించే రోజు. నిగ్రహం మాట పక్కన పెట్టి తన ఇంద్రియాలన్నింటికి ఒకే ప్రశ్నావళి పంచు రోజు. తమ తమ దైనందిన కార్యక్రమాలు మరచి వేకువ ఝామునే వీధుల వెంటపడు రోజు. వస్తువు అసలు ధరకన్నా తగ్గింపు ధర బహు ఇంపైన రోజు. మునుపెన్నడు పేరైనను వినని, కనని దుకాణముల గుమ్మములు త్రొక్కు రోజు. ఈ మాసంలో ప్రభుత్వం వారిచ్చు సగం పన్ను రాయితీని అసంకల్పితంగా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేయు రోజు.

ఎవరి చుట్టూ ఎవరు?



టీచర్: చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరి సూర్యుడేమో… 
రాంబాబు: నాకు తెలుసు టీచర్… సూర్యుడేమో రోజూ నా వెంటే తిరుగుతున్నాడు. ఎందుకంటే… రోజూ ఉదయం స్కూలుకోచ్చేప్పుడూ నా వెనకాలే వస్తున్నాడు, సాయంకాలం తిరిగి ఇంటికెళ్ళేప్పుడూ నా వెనకాలే వస్తున్నాడు.

అసంకల్పిత ప్రతీకార చర్య



        వీకెండ్ వచ్చిందంటే చాలు రాంబాబుకి పట్టలేని ఆనందం. అదేదో సినిమా కోసం తమిళంలో వైరముత్తు గారు చెప్పిందే తెలుగులో ఎ యమ్ రత్నం గారు తిప్పి చెప్పినట్టు వారం ఐదునాళ్ళు ఆఫీసు వాళ్ళు వీర తోముడు తోమి వదిలితే మిగిలిన రెండునాళ్ళు మాత్రం కేవలం నాకే అంకితం అన్నట్టు కనీసం వీధి గుమ్మం ముఖం కూడా చూడకుండా లివింగ్ రూమ్ కి మాత్రం పరిమితమై ఆ వారమంతా పాచిపోయిన తెలుగు TV సీరియళ్ళు, రియాలిటీ షో ఎపిసోళ్ళు అన్నీఅయిపోయి అమ్మయ్య ఈవారం ఇంటర్నెట్ బిల్ గిట్టుబాటయినట్టే అనుకుంటూ.. బోనస్ గా పడుకునే ముందు చిమటా మ్యూజిక్ సైట్ లో 1980s SPB హిట్స్ ప్లేలిస్ట్ కనీసం ఏకధాటిగా 4-5 గంటలపాటు మోగేట్టు సెట్ చేసి ఇక ఈ వారాంతానికి పక్కెక్కాడు.
        పాటల్లో మాధుర్యమో లేక వీరతోముడు వల్ల వచ్చిన అలుపోగాని మొత్తానికి మత్తుగా నిద్రపట్టింది. జయమాలిని, జ్యోతిలక్ష్మిలతో మొదలెట్టి సిల్క్ స్మిత, డిస్కోశాంతిల మీదుగా నిన్న మొన్నటి ముమైత్ ఖాన్, హంసనందిని వరకు ఎవ్వరినీ అవమానించకుండా ఒక్కొక్కరిని పేరు పేరునా కలవరిస్తూ నచ్చిన లోకాలమీదుగా అలా తేలికగా విహరిస్తుండగా ఇంతలో ఎవరో ఒకటికి రెండు సార్లు ‘Stupid Fellow.. Stupid Fellow..’ అని తిట్టినట్టనిపించింది. బాగా పరిచయమున్న గొంతులా ఉండడమో లేకా తిట్లు ఆపకపోవడమో మొత్తానికి ఎవరో తన్ని లేపినట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. గోడమీద గడియారం మాత్రం నీకప్పుడే తెల్లారిందేరా అన్నట్టు 2-3 మధ్యలో చిన్నముల్లు చూపించింది. ఒక నిమిషం తరువాత నిద్ర మత్తు దిగాక అర్థమైంది తిట్టింది మెగావోడని. మొన్నామధ్య మెగావోడు ఓ అభిమానిని తిట్టినప్పటినుంచి అదే యావ. గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది రాంబాబుకి. ఎందుకంటే వాడు పుట్టి బుద్ధెరిగి అభిమానించింది, ఆరాధించింది మెగావోడ్నే. అంతే ఆవేశంగా ఈ నాలుగు మాటలు రాసి ‘Facebook’లో పడేశాడు.
అభిమానం – అవమానకరం (మామూలుగా కాదు.. మెగా)
అభిమానం – ప్రమాదకరం (సాయి ధర్మ్ తేజ్ ఘటన)
అభిమానం – ప్రాణానికి హానికరం (బాద్ షా దుర్ఘటన)
అభిమానం – ఆత్మహత్యా సదృశం (ఉదయ్ కిరణ్ జీవితం)
ఎవరెన్ని చెప్పినా..
అభిమానం – ఒక
అసంకల్పిత ప్రతీకార చర్య

నువ్ ‘ఉల్టే’ నా జతగా.. నే ‘ఉల్టా’ నీ ఊపిరిగా..



nuuvunte

        రాంబాబోళ్ళ బుడ్డోడు (వయస్సు 3) ఇదే పాటని పొల్లు పోకుండా ‘నువ్ ఉల్టా… నే ఉల్టా…’ అని పాడుతుంటే… చిన్నవయసులే కొంచెం పెద్దైతేగానీ ఆ ఉఛ్చారణ లోపాలు పోవనుకుని ఆ విషయం అక్కడే వదిలేశాట్ట.
        కానీ ఇదే పాటతో మెన్నీమధ్య ఓ పాటల పోటీలో పాటగాడు దిన్కర్ కూడా ఉఛ్చారణలో వాళ్ళ బుడ్దోడితో పోటీపడుతుండటంతో ఆగలేక పనిగట్టుకుని ఈ పాట రాసిన కవి, పాట సాహిత్యం గురించి గూగుల్ని అడిగాట్ట. కవి తెలుగోడే, కానీ పాటగాడు, సంగీతకర్త కాదు. అయితేనేం అందరూ ద్రవిడులే… దగ్గరుండి Kennedy John Victor (చియాన్) తో రమారమి 11 సార్లు ఈ ఉల్టా పల్టీలు కొట్టించారట.
        “మహాప్రభో రహ్మాన్… నువ్వు తెలుగు సినీ సంగీతానికి చేసిన మేలుకన్నా, సాహిత్యానికి చేసిన (దెగ్గిరుండి చేయించిన) అన్యాయం, అగౌరవం ఎక్కువ. శంకర శాస్త్రిగారు గాని బ్రతికుంటే.. ఈ అనువాద సంగీత, సాహిత్యాల పెనుతుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ తెలుగు సినిమా సాహిత్యజ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులడ్డుపెట్టగల(చేతిలో లడ్డు కాదు) దాతకోసం వెతికేవారేమో.. హతవిధీ!” అని వాపోయాడు♣

గరుడాసనం



garudasana
        మా రాంబాబుకి ఒక చెత్త, చిలిపి.. కాదు కాదు… ఒక చిలిపి, చెత్త డౌటొచ్చింది. ఇప్పుడు కాదులెండీ, చిలిపి వయసుకన్నా చిన్నప్పుడు. మనలో కొందరికైనా (నా ఉద్దేశంలో కొందరు=అందరు-x while x→0) చిన్నప్పుడు క్లాసు మధ్యలో లేచి గరుడాసనమేస్తూ చిటికెనవేలు లేదా చూపుడువేలు, మధ్యవేలు కలిపి చూపించవలిసిన అవసరంతో కూడిన అనుభవం ఉండుండకపోదు. కాని మావాడికి ఆ వేళ్ళ ఎంపిక, కాంబినేషను వెనుకున్న రహస్యం ఛేదించాలని ఆలోచనపుట్టింది. లేచిందే లేడికి పరుగు అన్నట్టు, అప్పటికే అందరికీ అరబుర్ర వెధవగా సుపరిచితుడైన మావాడు ఈ దెబ్బతో నిండుబుర్రగలవాడని నిరూపించుకునే అవకాశం వచ్చిందనుకున్నాడో ఏమో వెంటనే తన ఆ రెండవ అరలోంచి ఒక తెలివైన ప్రశ్నని క్లాసు మధ్యలో టీచరు ముందు ప్రవేశపెట్టాడు. వీడి డాష్ లో ప్రశ్నకి టీచర్ కి డాష్ డాష్ లో కాలినట్టుంది… “చెత్త వెధవ చెత్త ప్రశ్నలు నువ్వూను. ఏది ముందో ఏది వెనుకో కూడా తెలియదు వీడికి” అని తిట్టి కూర్చోబెట్టింది. వాడికి మాత్రం డౌటు తీరలేదుకాని మాకు మాత్రం తీరింది.. అదే ఒకటి ముందు, రెండు వెనుక అని… నా ఉద్దేశం అంకెల క్రమంలో ♣

"Hello World"



పువ్వు పుట్టగానే పరిమళించినట్టు… ప్రోగ్రామర్ పుట్టగానే ‘Hello World’ అన్నాట్ట.

"ఏ లాంగ్వేజ్ లో?"

ఆఁ..? ఏ లాంగ్వేజ్ లోనా…?
ఎవడ్రా అది బ్లూ స్క్రీన్ ఫేసు వాడూను,
స్పెల్ చెక్కర్ ఆన్ చేసి కూడా ఇంగ్లీషులో ‘I’ తప్పు టైపు చేసే వెధవాన్ని,
పెన్ డ్రైవ్ అడిగితే ఇంకయిపోయిందనే మొహమూ నువ్వూను,
పేరడిగితే గూగుల్లో ‘what is my name?’ అని సెర్చ్ కొట్టే మెదడూ నువ్వూను,
రీసైకిల్ బిన్ లో చెత్త ఫోటోలు వెతుక్కునే మొహమూ నువ్వూను…
అరెరే… రాంబాబన్నా నువ్వా… జలుబు చేసిందాన్నా… గొంతు గుర్తుపట్టలే. ‘ఏ లాంగ్వేజ్ లోనా…?’ భలే టైమింగన్నా నీది. నా దినంజేశావనుకో.. అదే ‘You made my day’ అని నా ఉద్దేశం. అన్నట్టు నిన్న సెకండ్ షో సంపూర్ణేష్ బాబు సినిమాకెల్లావంటగా బాగా నిద్రపట్టిందాన్నా? హాల్లో కాదన్నా.. ఇంటికొచ్చాక రాత్రికి. అవునా.. ఐతే పడుకో.. ఉంటామరి♣

అలిగాడు



        ఆగండాగండి.. ఇదేదో ‘ఆగడు’, ‘ఉలకడు’, ‘పలకడు’ లాగా మన తెలుగు సినిమా టైటిలని తొందరపడి ఒక అభిప్రాయానికి వచ్చేయకండి. అలా అని ఇదేదో కమెడియన్ ‘ఆలి’ గారి కొత్త టీవీ షో అంతకన్నాకాదు. ఇది మా రాంబాబు ఫేస్ బుక్ స్టేటస్ మెసేజ్. తాటికాయంత అక్షరాలతో మావాడ్ని ‘గాడు’ అని సంబోధించినందుకు మావాడు చంటోడయ్యాడు. వెంటనే ‘feeling అలక with Upendra Vedullapalli ‘ అని ఫేస్ బుక్ స్టేటస్ మెసేజ్ పెట్టాడు. ‘అలక’కి సమానార్థకమైన ఆంగ్లపదం దొరక్క కాబోలు భావం చెడకూడదని అలా ఫిక్స్ అయ్యాడు. బహుశా ఆంగ్లేయులు అలగరేమో, లేకపోతే వాళ్ళెవరూ మావాడితో అలిగినట్టుచెప్పలేదేమో.
        అప్పటికీ నా ఉద్దేశం అదికాదురా మిత్రాంధ్రా… రాంబాబు ‘గాడ్డు’ అని వ్రాయబోయి అలా.. ఏదో.. టైపో అని ఇంగిలీషు కీబోర్డుతో తెలుగులో టైపు చెయ్యడానికి నేనుపడ్డ 8 కష్టాలుగా చెప్పి తప్పించుకోబోయా. “ఇంకానయం నువ్వు ‘డ’ కింద ‘డ’వత్తు మర్చిపొయావుగనక సరిపోయింది. పొరపాటున ‘గ’ కి ‘డ’ కి మధ్యలో ఏ ‘సున్నా’ నో ‘అర సున్న’నో టైపో చేసుంటే నా బ్రతుకు విజయవాడ పాత బస్టాండు అయ్యేది” అని ఒక్కసారిగా ఫోనులో వాడి ఏడుపు వ్యాప్తిని, ఎక్కిళ్ల తరుచుదన్నాన్ని అమాంతంగా రెట్టింపు చేసేశాడు. ఇలాంటి టైపోలు మళ్ళీ దొర్లనివ్వనని వోట్టేయమని ఫోన్ నెత్తిమీద పెట్టుకన్నాడు. ఏం చేస్తాం అలా ఒట్టేసి ఇలా మొట్టేయక తప్పలేదు. ఏమైతేనేం ఇన్నాళ్ళకి మళ్ళీ మా రాంబాబుకి ఒక కొత్త స్టేటస్ మెసేజ్ ఇచ్చి వాడిలో వాడికి అజ్ఞాతంగా, నిద్రాణంగా ఉన్న సృజనాత్మకతని తిట్టి లేపినందుకు చాలా సంతోషంగా ఉంది♣

అంతర్ముఖపుస్తకం



        మొన్నీమధ్య మా రాంబాబుగాడు ఒ(బా)మెరికా నుంచి ఫోన్ చేశాడండి. రాంబాబు’గాడు’ అని చాలా స్వతంత్రంగా సంబోధించానంటే వాడు తప్పకుండా నాకెక్కడో classmate అయ్యుంటాడని తొందరపడి guess కొట్టిన వాళ్ళంతా ఒకసారి రెండు కాళ్ళు కడుక్కురండి అసలు విషయం చెబుతా…
        మా రాంబాబు నా classmate కాదండీ. మా వీధి చివర బంగాళా పెంకుటిల్లు అప్పారావు గారి పెద్దబ్బాయి. వయసులో మాకన్నా పెద్దోడైనా పాపం వాడి సమవయస్కులెవరూ మా వాడకట్టులో లేకపోవడంతో మాతోనే ఆటలు, పాటలు (పనిలో పనిగా తిట్లు, తన్నులు కూడా) కానించేసేవాడు. అంచేత వాడి మెదడు కూడా మాతోపాటే సమాంతరంగా వృద్ధి చెందుతూవచ్చింది. తెలిసో తెలియకో మా రాంబాబు చిన్నప్పటినించీ ప్రతిదానికీ ఒక పంచవర్ష ప్రణాళిక అనుసరించేవాడు. నా ఉద్దేశం.. 10th, Inter, Engg చివరాఖరికి అమీర్ పేట చేరటంలో కూడానన్నమాట. ఏమైతేనేం మనోడు Bay Area లో settle అవ్వాలన్న వాడి తాతమ్మకల మొన్ననే గోదావరి పుష్కరాలకి నెరవేర్చాడు. ఇంత ఉపోద్ఘాతం ఇచ్చాక మీ రాంబాబుకి పెళ్లయిందా? పిల్లలెంతమంది? అని అడక్కండి. అవన్నీ ప్రకృతిననుసరించి అలా జరిగిపోయాయన్నమాట.
        ఇంతకీ అసలు విషయమేంటంటే, అందరిలాగా మా రాంబాబుగాడు కూడా Facebook లో account ఓపెన్ చేశాడండీ. ఎడా పెడా పోస్ట్లు, షేర్లు అలా 3 comments, 6 likes తో మొదలైన వాడి Facebook జీవితం ‘Rambabu liked his own post’ కి చేరింది. ఫోన్లో వాడిగోల కూడా అదే. ఈ మధ్యకాలంలో Facebook ఓపెన్ చేస్తే కడుపు తరుక్కుపోతోందిట. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడ్డట్టు వాడి బాధంతా ఫోన్లో ఎక్కిళ్ళు పెట్టి మరీ చెప్పుకున్నాడు. మనలో మనమాట మావాడికి చించుకోకపోయినా కడుపు మోకాళ్ళవరకు ఉంటుంది అదివేరే విషయమనుకోండి. ఇంతకీ వాడి సమస్యల్లా Facebook ఓపెన్ చేసినప్పుడల్లా ఎదురుగా వాడికి కనిపించే ఒకే ఒక ప్రశ్న ‘What’s on your mind?’ అని. వాడి argument ఏంటంటే ‘What’s on your mind need not always be what’s on your face(book)’ అని. ఈ సత్యం తెలియక గతంలో నాలుకపై band-aidలు వేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయట మావాడికి. ‘అమాయకత్వంలో అవకాశం’ లాగా మావాడికి ఒక మాంచి ఆలోచనకూడా వచ్చిందట. అదేంటంటే ‘ముఖపుస్తకం’ లాగా ‘అంతర్ముఖపుస్తకం’ (Soulbook లాంటిది) ఒకటి ఉంటే ఎలా ఉంటుంది అని. ఇదే తడవుగా యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ కాన్సెప్ట్ మీద patent గాని తీసుకున్నరేమో అని విచారించాడు కూడానంట. మొత్తానికి మావాడికి అమెరికా గాలి, నీళ్ళే కాదు పిజ్జాలు, బర్గర్లు కూడా బాగా పడ్డట్టున్నాయి. చూడాలి ముందు ముందు ఏమేం కబుర్లు వినిపిస్తాడో…