Saturday, May 14, 2016

మౌనంతో ముచ్చట్లు




ఈతరాని ఒక మనిషి, చుట్టూ కాపాడేనాథుడు లేని పరిస్థితుల్లో.. నడిసంద్రంలో పడవలోంచి జారి నీళ్ళలో పడ్డాడు. మెదట కొన్ని క్షణాలు ప్రాణంకోసం పాకులాడినా.. తరువాత కాపాడేవారు లేరని తెలిసి ప్రాణం మీద అశపోయి (అనేకన్నా వదిలేసి) వేలమీటర్ల లోతున్న సముద్రంలోకి ఆలోచనకొక్క అంగుళం చొప్పున మునిగిపోతూ తన జ్ఞాపకాల పొరల్లోంచి మనసుకి ఇంచి ఇంచి దూరంగా ఒక్కొకర్ని గుర్తు చేసుకుంటూ గడిపే ఆ చివరి క్షణాలు (అనేకన్నా యుగాలు) ఎంతో భారంగా ఉంటాయి. అది పరిపూర్ణ ఏకాంతం. నిస్వార్ధభరితం. శ్వేతవర్ణభరిత మౌనం. క్షణాల్లో జీవితమంతా తన కళ్ళ ముందు కదులుతుంది. ప్రేమలు, బంధాలు, బాధ్యతలు, భవిష్యత్తు... అవును ప్రేమించిన వారి భవిష్యత్తు, అది భార్య పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కావచ్చు. ఇష్టపడ్డ పని లేదా లక్ష్యం కావచ్చు. 
నిత్య జీవితంలో కూడా ప్రతి మనిషి (ఏ కాంత చెంత లేని) ఏకాంతంలో అంత కాకపోయినా ఎంతో కొంత మౌనం ఆవహించిన క్షణాల్లో దేని గురించి ఆలోచిస్తాడు. ఒంటరిగా ఒక సుదూర ప్రయాణంలో, సంధ్యాసమయంలో సాగరతీరంలో, వేసవిలో ఓ వెన్నెల రాత్రిలో, కళ్ళు తెరచి తీక్షణంగా ఆ శూన్యంలో ఏం చూస్తాడు. ఆ నిశ్శబ్ద సంగీతం ఏ రాగం. నిష్కల్మషమైన ఆ తెల్లని మౌనంతో ఎలాంటి ముచ్చట్లు చెపుతాడు. తన రహస్యాల పెట్టెలోంచి ఒక్కొక్క వస్తువు బయటికి తీస్తాడు. ఆ వస్తువులు పోగొట్టుకున్న మనుషులు, వాళ్ళ ప్రేమలు, తెగిపోయిన బంధాలు తరువాత తెలిసిన వాటి విలువలు, చేజారిన అవకాశాలు, దరిచేరిన విజయాలు, వెంటపడే ఓటమి భయాలు ఇలా ఏవైనా కావచ్చు. ఒక్కొక్క వస్తువు వంక మనసారా చూసుకుని, జ్ఞాపకాలు నెమరువేసుకుని ముద్దు ముచ్చట్లాడి మళ్ళా పదిలపరుచుకుంటాడు. ఒక్కోసారి ఆ మౌనంలో కూడా ఆలోచనకీ ఆలోచనకీ మధ్య మౌనం ఆవహించవచ్చు. ఆ సంభాషణలో తన ఆత్మ సాక్షాత్కారం కావచ్చు. ఆత్మావలోకనంలో తన తప్పులు తను తెలుసుకోనూవచ్చు. తన సమస్యకి పరిష్కారం దొరకవచ్చు. 
అలా మనలో మనల్ని మనముందు ప్రతిష్టించుకుని మనసులో దాచుకున్న ప్రశ్నలడిగి, దాచుకోలేని జవాబులు చెప్పి చేసే ఆత్మ సంభాషణ, ఆ మౌనంతో మనసు చెప్పే ముచ్చట్లు ఎంతో అందంగా ఉంటాయి.

2 comments:

  1. కానీ తమ్ముడూ నీళ్లల్లో పడితే అతి త్వరగా చస్తారు అంటారు ఇంత ఆలోచించేే టైముంటుందా....అని డౌటు
    ఆత్మ సంభాషణ మాత్రం నిజ్జంగా నిజం అది బతికున్నప్పుడే చేయాలి అప్పుడే మీరు అన్నట్లు దాని అందం తెలిసేది. అని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. పందొమ్మిదేళ్ళ వయసులో నీట మునిగి తేలిన మృత్యుంజయుని స్వానుభవం. ఆత్మ సంభాషణ ఒక అందమైన అనుభవం నా అనుభవంలో.

      Delete