Friday, October 04, 2019

ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం.
శశి మసిబాసిపోయే చుక్కలు తోకచుక్కలాయే
పున్నమి రాదు పొన్నచెట్టుకానరాదు
పేదరాశి పెద్దమ్మ కథ కంచికి దారి మరచే
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం.

వెండిమబ్బుల గుండెలు పగిలె
వెన్నెల మడుగుల సుడిగుండంబులు తిరిగె
నింగి అశృధారల రైతు ఆశలు మునింగి అసువులుబాసె
రాజ్యములు బీడులవ రాజులే మిగిలె
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం.

ఋతువులకు క్రమము లేదు క్రతువులకు కాలము కాదు
తుషారములు లేవు సమీరములు సమీపమునకు రావు
పెనుగాలికి గిజిగాడి గూడు గోదారి వశమయ్యే
హరితవనమున కార్చిచ్చునెవరు రగిల్చె
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం

హిమము గరమై సాగరమ్ము రేవుని మింగె 
ఆశల అలల మాటున సునామీలు దోబూచులాడె 
నావ నలుసై సేతు గర్భమున కాలము చెందె
జాలరి బ్రతుకున మెతుకు బరువాయె
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం

ప్రియ భృంగములు రాక పుష్పముల కనుల నిష్ఫలములు కాచె
సీతాకోక కోక వెలిసిపోయే కోకిల గొంతు జీరబోయె
అకటా..  ప్రకృతి కాంత వైధవ్యమునొందెనా?
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం

నవతర ఆబాలగ్రేతములు ముక్తకంఠమున తరతరాలను నిలదీసె
ఎవ్వరిదీ శాపమని?  ఇంకెవ్వరిదీ పాపమని? 
పశ్చాత్తాపమునకు సమయమెక్కడిది?
చిత్తశుద్దితో ప్రాయశ్చిత్తమునకు నడుముకట్టుడని.


Friday, April 06, 2018

వర్ణావృతం


మొన్నటి వసంతంలో పుట్టింటి వారు పెట్టిన పచ్చని వెచ్చని పచ్చిక చీర, నిన్నటి శ్రావణంలో వర్షానికి తడిసిందని,

ఇప్పుడు శిశిరం వచ్చి తనువంతా రంగుల ఆకులతో ఆఛ్ఛాదన నిస్తే… ధవళ వస్త్రధారిణీ.. మా ప్రియ ధరణీ..

నిన్నటి వర్షంలో నవ్వుల హరివిల్లుతో పువ్వులు పూయించి సప్తవర్ణాలు తనసొంతం అనుకుని,

కార్తీకంలో వెన్నెల మడుగుల సంబరం జరుపుకున్న అంబరానికి సైతం అసూయ కలిగించావు. 

మరీ మురిసిపోకు వచ్చే హిమపాతంతో నువ్వు తెల్లచీర కడితే,ఎగిరే గువ్వకు, నింగికి - నీకు తేడా శూన్యం అని (అశాశ్వ)తత్వం బోధపడుతుంది.Sunday, August 07, 2016

వెండి తీగలుమూడేళ్ళ క్రితం తలలో కనిపించావ్.. మా ఇంటి యజమానిని పెట్టించి నీ పీక తెగ కోయించా. మూడు నెలల క్రితం గడ్డంలో కనిపించావ్.. మంటలేస్తున్నా రోజుమార్చి రోజు షేవింగ్ చేస్తూ నీ ఉనికి లేకుండా చేస్తున్నా. మూడు వారాల క్రితం మీసంలో.. మూడు రోజుల క్రితం నాసికా కుహురంలో. కానీ..కానీ.. మూడు నిమిషాల క్రితం కను బొమలు.. చివరికి రెప్పలలో కూడా నిన్ను చూశాక ఇప్పుడర్థమయింది 'ఇందు గలదందు లేదని సందేహము వలదు శిరస్సంతా ఎందెందు వెదకిన అందందే కలదు'. సర్వాంతర్యామీ.. ఈ లైను నీకు పూర్తిగా నప్పుతుంది.

Sunday, July 31, 2016

గురవయ్య మాష్టారు
ఒరేయ్ దరహాస్ ఆ ఏడుపు ఆపరా క్లాసులో అసయ్యంగా.

అమ్మా షర్మిళా మమ్మల్ని సిగ్గుపెట్టకుండా కాస్త తిన్నగా కూర్చోటం అలవాటు చేసుకోతల్లి. పై తరగుతుల్లోకెళితే ఇలాటివి ఎవరూ చెప్పలేరు, చెప్పరు.

నాయనా కుచేలకృష్ణ బ్రేక్ లో తిందువు ఆ అటుకులు లోపల పెట్టు.

అమ్మా సుభాషిణీ.. ఆడపిల్లలు అలా బూతులు మాట్లాడితే ఆట్టే బాగోదమ్మా. తగ్గించు.

బాబూ జ్ఞానేశ్వర్.. ఒకటో ఎక్కం చదవటమేవిటిరా? నీ బండ బడ.

అమ్మా సునయన.. కళ్ళకి కాటుక మాత్రం దట్టంగా పట్టిస్తావ్, కాని కళ్ళద్దాలు మర్చిపోయొస్తే ఎలామ్మా?

శ్రీమంత్ బాబూ.. ఆర్నెల్లవుతుంది స్కూలు ఫీజు కట్టక, మీ నాన్న కుబేర్రావ్ గారికి కాస్త గుర్తుచెయ్.

అమ్మా వృక్షశ్రీ.. అబ్బా ఆ పేరు పిలవాలన్నా రాయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది తల్లీ. మీ నాన్నగారు 'సుందర్ లాల్ బహుగుణ అభిమాని' అవటం మా చావుకొచ్చింది.

కోమలీ.. నువ్వలా క్లాసులో మగపిల్లల్ని కూడా కొడుతుంటే నాక్కూడా కాస్త భయంగానే ఉంటుంది ఈ మధ్య.

ప్రియ దర్శినీ.. తలకు ఏ బ్రాండు ఆముదం వాడతావో చెబితే మా చంటోడికి అజీర్తి.. వద్దులే ఈ సారికి అల్లోపతిని నమ్ముకుంటా.

స్వప్నా.. అలా క్లాసులో పడుకోకూడదమ్మా.. లే.. ఏదీ.. చెయ్యి వెనక్కి తిప్పు.

రేయ్ సుశీల్.. ఆడపిల్లలతో ఆ వెకిలి చేష్టలేంటిరా..? ఏదీ.. వెనక్కి తిరుగు.

Wednesday, July 13, 2016

ప్రసవ వేదనహాస్పిటల్ లో ఓ స్త్రీమూర్తి ప్రపంచ జనాభా++ చేయడానికి ప్రసవ వేదన అనుభవిస్తుంది. ప్రసవ రోదన ప్రదాత ఆవిడ భర్త మూర్తేమో హాస్పిటల్ బయట టీ బండి దగ్గర వేళ్ళ మధ్యలోంచి ఊపిరితిత్తుల్లోకి పొగతోబాటు అమ్మాయా? అబ్బాయా? అనే కన్ఫ్యూజన్ని పీలుస్తూ..  రింగు, రింగులోరింగు,  ఆ రింగులో ఇంకో రింగు వదులుతున్నాడు ఆటవిడుపుగా. తన కలలో వచ్చిన అందమైన ఊహకు పదరూపం ఇవ్వడానికి ప్రసవ వేదన అనుభవిస్తున్నాడు ఆ పక్కనే పార్కులో ఒక మారుమూల బెంచి మీద ఓ కవితామూర్తి.కానీ పాపం ఈ మూర్తిగారికి నొప్పులు మొదలై నెలక్రితంమే నెలైంది. అదే పార్కులో నాలుగు బెంచీలవతల ఈరోజైనా ఎలాకోలా తను ప్రేమిస్తున్న విషయం తెలుగులోనే, ఇంగ్లీషులోనో, హిందీలోనో చెప్పాలని ప్రసవ వేదన అనుభవిస్తున్నాడు ఒక ప్రేమమూర్తి. ప్రియురాలు మాత్రం ప్రేమతో.. “మూర్తీ.. ఐస్క్రీమ్ మీద ఇవాళ్టి కెరామెల్ టాపింగ్ కన్నా నిన్నటి చాకొలేట్ టాపింగే బావుంది” అని బ్రేవుమంది. ఈ మూర్తి గాడి వేదన/రోదన మొదలై ఎన్నాళ్ళయిందో మీ ఊహకే వదిలేస్తే..  పార్కుకి ఆనుకుని ఉన్న కాలేజీలో ఇన్విజిలేటర్ ఇప్పుడే వడ్డించిన వేడి వేడి క్వశ్చన్ పేపర్లోంచి తెలియని ప్రశ్నలకి జవాబులు రాయడానికి ఆ విద్యామూర్తి పడేది ప్రసవ వేదన కాకపోతే ఇంకేంటి?