Friday, October 04, 2019

ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం.
శశి మసిబాసిపోయే చుక్కలు తోకచుక్కలాయే
పున్నమి రాదు పొన్నచెట్టుకానరాదు
పేదరాశి పెద్దమ్మ కథ కంచికి దారి మరచే
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం.

వెండిమబ్బుల గుండెలు పగిలె
వెన్నెల మడుగుల సుడిగుండంబులు తిరిగె
నింగి అశృధారల రైతు ఆశలు మునింగి అసువులుబాసె
రాజ్యములు బీడులవ రాజులే మిగిలె
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం.

ఋతువులకు క్రమము లేదు క్రతువులకు కాలము కాదు
తుషారములు లేవు సమీరములు సమీపమునకు రావు
పెనుగాలికి గిజిగాడి గూడు గోదారి వశమయ్యే
హరితవనమున కార్చిచ్చునెవరు రగిల్చె
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం

హిమము గరమై సాగరమ్ము రేవుని మింగె 
ఆశల అలల మాటున సునామీలు దోబూచులాడె 
నావ నలుసై సేతు గర్భమున కాలము చెందె
జాలరి బ్రతుకున మెతుకు బరువాయె
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం

ప్రియ భృంగములు రాక పుష్పముల కనుల నిష్ఫలములు కాచె
సీతాకోక కోక వెలిసిపోయే కోకిల గొంతు జీరబోయె
అకటా..  ప్రకృతి కాంత వైధవ్యమునొందెనా?
ఎవ్వరిదీ శాపం..? కాదు ఇది స్వయంకృతం

నవతర ఆబాలగ్రేతములు ముక్తకంఠమున తరతరాలను నిలదీసె
ఎవ్వరిదీ శాపమని?  ఇంకెవ్వరిదీ పాపమని? 
పశ్చాత్తాపమునకు సమయమెక్కడిది?
చిత్తశుద్దితో ప్రాయశ్చిత్తమునకు నడుముకట్టుడని.


No comments:

Post a Comment