Saturday, May 14, 2016

మౌనంతో ముచ్చట్లు




ఈతరాని ఒక మనిషి, చుట్టూ కాపాడేనాథుడు లేని పరిస్థితుల్లో.. నడిసంద్రంలో పడవలోంచి జారి నీళ్ళలో పడ్డాడు. మెదట కొన్ని క్షణాలు ప్రాణంకోసం పాకులాడినా.. తరువాత కాపాడేవారు లేరని తెలిసి ప్రాణం మీద అశపోయి (అనేకన్నా వదిలేసి) వేలమీటర్ల లోతున్న సముద్రంలోకి ఆలోచనకొక్క అంగుళం చొప్పున మునిగిపోతూ తన జ్ఞాపకాల పొరల్లోంచి మనసుకి ఇంచి ఇంచి దూరంగా ఒక్కొకర్ని గుర్తు చేసుకుంటూ గడిపే ఆ చివరి క్షణాలు (అనేకన్నా యుగాలు) ఎంతో భారంగా ఉంటాయి. అది పరిపూర్ణ ఏకాంతం. నిస్వార్ధభరితం. శ్వేతవర్ణభరిత మౌనం. క్షణాల్లో జీవితమంతా తన కళ్ళ ముందు కదులుతుంది. ప్రేమలు, బంధాలు, బాధ్యతలు, భవిష్యత్తు... అవును ప్రేమించిన వారి భవిష్యత్తు, అది భార్య పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కావచ్చు. ఇష్టపడ్డ పని లేదా లక్ష్యం కావచ్చు. 
నిత్య జీవితంలో కూడా ప్రతి మనిషి (ఏ కాంత చెంత లేని) ఏకాంతంలో అంత కాకపోయినా ఎంతో కొంత మౌనం ఆవహించిన క్షణాల్లో దేని గురించి ఆలోచిస్తాడు. ఒంటరిగా ఒక సుదూర ప్రయాణంలో, సంధ్యాసమయంలో సాగరతీరంలో, వేసవిలో ఓ వెన్నెల రాత్రిలో, కళ్ళు తెరచి తీక్షణంగా ఆ శూన్యంలో ఏం చూస్తాడు. ఆ నిశ్శబ్ద సంగీతం ఏ రాగం. నిష్కల్మషమైన ఆ తెల్లని మౌనంతో ఎలాంటి ముచ్చట్లు చెపుతాడు. తన రహస్యాల పెట్టెలోంచి ఒక్కొక్క వస్తువు బయటికి తీస్తాడు. ఆ వస్తువులు పోగొట్టుకున్న మనుషులు, వాళ్ళ ప్రేమలు, తెగిపోయిన బంధాలు తరువాత తెలిసిన వాటి విలువలు, చేజారిన అవకాశాలు, దరిచేరిన విజయాలు, వెంటపడే ఓటమి భయాలు ఇలా ఏవైనా కావచ్చు. ఒక్కొక్క వస్తువు వంక మనసారా చూసుకుని, జ్ఞాపకాలు నెమరువేసుకుని ముద్దు ముచ్చట్లాడి మళ్ళా పదిలపరుచుకుంటాడు. ఒక్కోసారి ఆ మౌనంలో కూడా ఆలోచనకీ ఆలోచనకీ మధ్య మౌనం ఆవహించవచ్చు. ఆ సంభాషణలో తన ఆత్మ సాక్షాత్కారం కావచ్చు. ఆత్మావలోకనంలో తన తప్పులు తను తెలుసుకోనూవచ్చు. తన సమస్యకి పరిష్కారం దొరకవచ్చు. 
అలా మనలో మనల్ని మనముందు ప్రతిష్టించుకుని మనసులో దాచుకున్న ప్రశ్నలడిగి, దాచుకోలేని జవాబులు చెప్పి చేసే ఆత్మ సంభాషణ, ఆ మౌనంతో మనసు చెప్పే ముచ్చట్లు ఎంతో అందంగా ఉంటాయి.

Thursday, May 05, 2016

సర్వజ్ఞానానాం లౌక్యం ప్రధానం



జ్ఞానోదయం 
"సర్వజ్ఞత" అనేది సైద్ధాంతికం (theoretical), అనంతం. అంటే లెక్కల్లో (infinity) 'లాంటిది కాదు', అదే. ఇది నాస్థి అనిచెప్పాలి. పదార్ధస్పృహ నశించినవారికి లభించే బ్రహ్మజ్ఞానానికిది కనీసార్హత.
"నిర్దిష్ట జ్ఞానం" ఏదేని ఒక విషయం గురించి కూలంకషంగా అధ్యయనం చేస్తేనే లభిస్తుంది. ఉదాహరణకి వైద్యంలో దంతవైద్యం లాగానన్నమాట.
"అ-జ్ఞానం".. అదొకరకపు జ్ఞానం, చాలా ప్రాధమికం. ముఖ్యంగా పశుపక్ష్యాదుల్లో, పసి పిల్లల్లో పుష్కలంగా ఉంటుంది. కొందరిలో పెద్దైనా పోదు. ఇదే ప్రపంచాన్ని నడిపిస్తుంది. పదార్ధ జీవనవిధానానికి ఇది పట్టుకొమ్మ. ఇదే మిడి మిడి జ్ఞానంగా కొన్ని సందర్భాల్లో చలామణీ అవుతుంది.
సాధారణ జ్ఞానం (common sense) ఇది తప్పనిసరి. ఇది కొరవడితే కష్టాలే… ముఖ్యంగా ఎదుటివారికి. కొందరిలో ఇది సందర్భాన్నిబట్టి బహిర్గతమౌతుంది. 
లెక్కల్లో సున్నా(0) కి శున్యానికి(ø) ఉన్న తేడానే అజ్ఞానానికి జ్ఞానశూన్యానికి ఉంది. 
అజ్ఞాని కానివాడు జ్ఞాని కాలేడు ఎందుకంటే 'వేయిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలౌతుంది' అన్నారుగా జ్ఞానాగ్రేసరులు.
విద్యుత్ ప్రవాహంలాగే జ్ఞాన ప్రవాహం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేవలం జ్ఞాన ప్రసారం మాత్రమే జరుగుతుంటుంది, బాబాల దగ్గర.
ఎన్ని జ్ఞానాలున్నా "సర్వజ్ఞానానాం లౌక్యం ప్రధానం" అని నా అభిప్రాయం. విజయలక్ష్మి గుడికి 5 మెట్లయితే ఇది అదృశ్యమైన(invisible) 6వ మెట్టు. ఆధునిక ప్రపంచంలో ఇది వజ్రాయుధం, రామబాణం, కవచకుండలం లాంటి వాటికన్నా శక్తివంతమైనది.
అందుకే ప్రపంచంలోని జ్ఞాన సమూహాన్ని చక్కగా ఒక బెల్ కర్వ్ లో ఇలా కుదించవచ్చునని... దించా.
ఇవికాక మీకు తెలిసిన జ్ఞానాలేవైనా ఉంటే క్రింద కామెంటండి :-)

నువ్వు.. ఎవరూ..?




అవంతిక: ఎవరు నువ్వు?

‘n’వ బాహుబలి: చెబుతాన్లేగానీ… అంతకన్నా ముందు నిన్నొకటడగాలి.

అవంతిక: ఆఁ..? (సహజమైన తన ప్రశ్నార్ధకమైన ముఖంతో)

‘n’వ బాహుబలి: నువ్వు.. ఎవరూ..? నేను చెప్పనా..? ఆ చింపిరి జుట్టు, చిరిగిన బట్టలు, చెమట కంపు, చీమిడి ముక్కు, పాచి పళ్ళు, ఎండిపోయిన పెదవులు, మెడలో ఆ పిచ్చి పూసలు… తప్పకుండా నువ్వు తప్పిపోయిన ఒక సెకండ్ జెనరేషన్ టార్జాన్ సుందరివయి ఉంటావు. ఆ చేతిలో కత్తి నీకు బొత్తిగా నప్పలేదు గానీ లెట్’స్ గో ఫర్ ఎ మేకోవర్ అండ్ దెన్ సింగ్ ఎ సాంగ్.

Monday, May 02, 2016

ఏంటీ..? నీకు అది లేదా?




ఎక్కడికెళ్ళినా ఇదే ప్రశ్న. వీధిలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి. ఇహ ఫ్రెండ్స్ ని కలిసినా కలీగ్స్ ని కలిసినా తలకొట్టేసినట్టుంటుంది. ఇంటికెళితే చివరికి అమ్మకూడా “పెళ్ళి కావలసిన పిల్లాడు, ఈ అవమాన భారం ఇంకెంతకాలం మోయనున్నాడో నా బిడ్డ. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా? నా పూజల్లో ఏలోపం జరిగిందో.. ఏమో? శిక్ష నా కొడుకు అనుభవిస్తున్నాడు. ఆపద్భాంధవా.. అనాధరక్షకా.. నా బిడ్డని ఆ లోప విముక్తుడ్ని చేసే భారం నీదే తండ్రీ” ఇన్ని డైలాగులు ఒకే ఒక్క దీనమైన ఎక్స్ ప్రెషన్ లో ఆవిడ చూపించిన క్షణాలెన్నో, అది తట్టుకోలేక తల నేలకేసి తిన్నగా తన గదిలోకెళ్ళి గడియపెట్టుకుని తడిపిన తలగడలింకెన్నో. ఏడ్చి ఏడ్చి అలిసిపోయి ఏదో దీర్ఘాలోచనలో అలా సీలింగ్ వైపు తీక్షణంగా చూస్తుండగా ఇంతలో కరెంటొచ్చి ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది. చల్లగాలికి కన్నీళ్ళైతే ఆవిరయ్యాయిగాని తన మనసులో ఆ లోపం తాలూకు ఆలోచనల సెగలు మాత్రం ఆరలేదు. మళ్ళీ కరెంటుపోయింది ఫాన్ ఆగింది. ఆగిన ఫ్యాన్ ఈసారి కిటికీలోంచి వచ్చే చిరుగాలికి ప్రతి 5 సెకండ్లకొక డిగ్రీ చొప్పున, మధ్య మధ్యలో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కి మరికొన్ని డిగ్రీల చొప్పున తిరుగుతుంటే తనతో ఏదో మాట్లాడుతున్నట్టనిపించింది. పరిపూర్ణమైన డిప్రెషన్లో ఉండటం వల్లో ఏమో అ మాటల్లో “ఉదయ్ కిరణ్, ప్రత్యూష బెనర్జీ, జియా ఖాన్” వీళ్ళ పేర్లు వినపడ్డాయ్. సీలింగ్ ఫ్యాన్లు బాన్ చెయ్యాలన్న రాఖీ సావంత్ మాట కాస్త ధైర్యాన్నిచ్చినా ఎవడి భయం వాడిది. అంతే ఒక్క ఉదుటున లేచి పరిగెత్తి హాల్లో ప్రమిదలకి ఒత్తులల్లుతున్న అమ్మని గట్టిగా కావలించుకుని అమ్మ కొంగంతా తడుపుతూ మొన్న నక్కాశీవారి వీధి రెండవ లైన్లో ఉన్న ‘నిత్యకళ్యాణి మ్యారేజ్ బ్యూరో’లో జరిగిన అవమానం గురించి చెప్పి ఘొల్లుమన్నాడు. ‘నిత్య కళ్యాణ్’ ఆ బ్రోకర్ వెధవ, వాడికింకా పెళ్ళికాలేదుకానీ ఊళ్ళోవాళ్లందరికీ సంభంధాలు చూస్తాడట. వచ్చిన ప్రతి ఆడపిల్లనీ ‘నువ్వేనా..? నాకు నువ్వేనా..?’ అన్నట్టు ఓరకంగా చూసి ఛస్తాడు కామాంధుడు. అలాగే వదిలేస్తే కొన్నాళ్ళకు మగపిల్లల్ని కూడా చూడక తప్పదు వెధవకి. పోయిన గురువారం రిజిస్ట్రేషనుకని వాడి దగ్గిరికెడితే నింపమని ఒక ఫాం చేతికిచ్చాడు. నాకు తెలిసినవి రాసిస్తే.. “ఏంటీ..? ఆ వివరం రాయలేదు? ఆ వివరం లేకుండా పిల్లనెతకడం కష్టం. ఇవాళా రేపు అమ్మాయిలు చాలా ఫాస్ట్. అన్నిటికన్నా ముందు అదుందో లేదో చూస్తున్నారు, వివరంగా ఉంటేనే అప్లికేషన్లు కన్సిడర్ చేస్తున్నారు. అయినా కనీసం అదికూడా లేని కుర్రాడ్ని నిన్నే చూస్తున్నా” అని వెటకారంగా నలుగురిలో పరువు తీశాడు. ఆ ఘటన గురించి విన్న వాళ్ళమ్మ తట్టుకోలేకపోయింది. వెంటనే కొడుకుని ఏడ్చిన మొహం కడుక్కుని పౌడర్ రాసుకుని తయారవ్వమని తనూ రెడీ అయింది. ఊళ్లోనే రంగుబజార్లో బొమ్మలబాబుగా పేరెన్నికగన్న నేటి మేటి ఫోటోగ్రాఫర్ సిరాజుద్దీన్ దగ్గరికి పట్టుకెళ్ళి వాడి చెవిలో ఏదో ఊదింది. వాడేమో వివరం చెప్పకండా తన చేత ‘నాలుగంకె వేస్తూ ఒకటి, థమ్సప్ చెప్పిస్తూ ఒకటి’ అలా అర్థంకాని భంగిమల్లో కొన్ని ఫొటోలు తీసి ఫోటోషాప్ లో పైమెరుగులుదిద్ది అవన్నీ ఒక USBలోకి కాపీచేసి వాళ్ళమ్మ చేతికిచ్చాడు. ఏంటమ్మా ఇదంతా..? అని ఎంత చెప్పినా వినకుండా..  “మారు మాట్లాడకు” అని అక్కడినుంచి తిన్నగా కోతిబొమ్మ సెంటర్లో ఉన్న ‘శ్రీ భ్రమరాంబిక నెట్ కెఫే’కి తీసుకెళ్ళి, USB వాడి చేతిలో పెట్టి వాడి కాళ్ళు పట్టుకుంది. “బాబ్బాబూ.. నీకు పుణ్యముంటుంది ఎలాకొలా నాకొడుక్కొక ఫెస్బుక్కెకౌంటు క్రియేట్ చేసిపెట్టు చచ్చి నీ కడుపున పుడతా.. నీ తల్లిలాంటిదాన్ని” అని వాడి వెళ్ళా, గోళ్ళా పడి ప్రాధేయపడింది. ఇన్నాళ్ళూ తల్లిదండ్రుల మాట గౌరవించి ఈ సామాజిక వలయాలకు దూరంగా బ్రతుకు వెళ్ళబుచ్చాడు నా కొడుకు. సమాజం వాడిని సోషల్లీ ఇనాక్టివ్ అని, ఇనర్ట్ అని, ఐసోలేటెడ్ అని ఇలా నానా మాటలు అంటుంటే కన్నకడుపు తరుక్కుపోతుంది బాబూ. అక్కడ నాకొడుకు ఒంటరి కాకూడదు నాకూ ఒక అకౌంటు క్రియేట్ చెయ్.. వాడికి ఫ్రెండ్ గా ఆడ్ చెయ్. ఓ వందిస్తాను నువ్వూ వాడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు. ఒరేయ్.. అబ్బాయిలూ తలా ఒక ముంత మసాలా ఇప్పిస్తాను నా కొడుక్కి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండర్రా అని ప్రతి క్యాబిన్ కి వెళ్లి ప్రాధేయపడింది. వెల్లికలా దిండుమీద తలపెట్టి పడుకున్నా వెనుకనుంచి ఎవరో చిన్న మెదడు చితికేలా క్యాట్బాల్ తో బెండుముక్కతో చాచిపెట్టి గెట్టిగా కొట్టినట్టనిపించి ఒక్కసారిగా మెలకువ వచ్చింది రాంబాబుకి. వాళ్ళమ్మని ఆపుదామంటే కాళ్ళూ చేతులూ ఎవరో మంచానికి కట్టేసినట్టనిపించింది. ఇది కలేమో అని అనిపించింది. అయితే బావుండనిపించింది. శరీరంలో మెదడు తప్ప ఏ అవయవం చెప్పిన మాట వింటున్నట్టు అనిపించలేదు. ఇహ చేసేదిలేక, నీ ఇష్టం నా పరువు బుగ్గిపాలే అని ఆ పీడకలలోంచి బయటకొచ్చే ప్రయత్నం వదిలేసుకున్నాడు. తరువాత కాసేపటికి నిజంగా మెలకువ వచ్చింది. వొళ్ళంతా చెమటతో ముద్దయింది. కరెంటు పోయి చాలాసేపయింది. వీధి లైట్లు పనిచేస్తున్నట్టున్నాయ్.. కిటికీలోంచి వెలుతురుకి ఆగిపోయిన సీలింగ్ ఫ్యాన్ కనిపించింది. లేవడానికింకో ప్రయత్నం చేశాడు. ఈ సారి ప్రయత్నం ఫలించింది. తలపట్టుకుని జరిగిందంతా జీర్ణించుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ప్రారంభించింది, కరెంటొచ్చింది. ఇహ ఆలశ్యం చేయదలుచుకోలేదు. వెంటనే లాప్టాప్ తెరిశాడు. ఎందుకో ఇంకా చెప్పాలా?