పెద్ద చదువులు చదువుకునే రోజుల్లో పుస్తకాలపైన పూర్తి పేరు రాయకుండా ఒక్క ‘U’ మాత్రం రకరకాల ఆకారాల్లో రాసుకునేవాడ్ని. పెద్ద చదువులంటే.. పేద్ద చదువులని కాదు, కాకపొతే చిన్నవాటికంటే కొంచెం పెద్దవన్నమాట. పుస్తకాల్లో అంతంత పొడవున పేర్లు రాయడం, అంతకన్నా పొడవుగా అండర్లైన్లు గీయడం, రంగురంగుల స్కెచ్చులతొ హైలైట్ చేయడం పుస్తకాలకుండే మానం, అభిమానం లాంటివి భంగం చేయడమేమోనని నా అభిప్రాయం.
ఏఁ.. ఆమ్లెట్లో గుడ్డుపెంకులు, ఖర్జూరంలో ఇసుక తగిలినట్లుందా? సరే.. కల్లుకొచ్చి ముంత దాయడమెందుకు అసలు విషయానికొచ్చేస్తా. వాస్తవమేంటంటే పాపం నా పుస్తకాలు చాలా మంచివి, మనసున్నవి. సెమిస్టరవ్వగానే ఓ వందో రెండొందలో చేతిలో పెడితే బస్సెక్కి పుట్టింటికెళ్ళి(కోఠీ), తరువాతి సెమిస్టరు పుస్తకాలని పంపించేవి. పిచ్చిగీతల్లాంటి చెత్త పనులుగానీ చెస్తే అలిగి చిత్తు కాగితాల కొట్టుకెళ్ళిపోయేవి పర్మనెంటుగా.
ఇంతకీ ఇంత ఉపోద్ఘాతమెందుకు ఎందుకిచ్చానంటే? ఒకసారి నాపేరులో ‘U’ తప్ప మిగతా అక్షరాలన్నీ దాడికొచ్చాయ్.. కలలో. వాటి జెండా, ఎజెండా ఏంటంటే వాటిని పూర్తిగా నల్లపూసలు చెసేశానని. వాటికి న్యాయం చేయకపోతే నిద్రపోనివ్వమని ఘెరావ్ చేశాయ్. మీలో అందరికి కాకపోయినా కొందరికైనా సందర్భాన్ని బట్టి తప్పకుండా న్యాయం చేస్తానని మాటిచ్చాకకానీ నిద్రపోనివ్వలేదు. వాటికిచ్చిన మాట నిలబెట్టుకుందామని రాగిణిని పెళ్లిచేసుకుని ‘R’కి సగం సీటిచ్చేశా(హృదయ సింహాసనంలో). నార్వే వచ్చి ‘N’కి నా చరిత్రలో కొన్ని పేజీలిచ్చా (చించి కాదు). పార్థు పుట్టాక ‘P’ని ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా.
నీళ్ళలో ఈతకొట్టడం రాకపోయినా భవసాగరాలు ఈదే పనిలో పడి మిగిలిన అక్షరాల మాట నిజంగా మర్చిపోయా. ఇంకేముంది ఈ సారి నాపేరులో లేని అక్షారాలు కూడా నామీద దాడికోచ్చాయి మా పరిస్థితేంటని.. మళ్ళీ కలలోనే. జిజ్ఞాస్ పుట్టాక నా పేరులో లేని అక్షరాల కోటాలోంచి ‘J’ని ఎత్తి రాగిణి ఒళ్ళో కూర్చోబెట్టా. ఇక ముందు ముందు దాడికి దిగినా, నాపై యుద్ధం ప్రకటించినా అందరికీ న్యాయంచేసే శారీరిక, మానసిక, ఆర్ధిక, సామాజిక ఇలా ఏరక-మైన ఓపికలు లేవని గెట్టిగా చెప్పేస్తా.. ఆ.. అంతే.
అలాగే మన జంబూ ద్వీపంలో కూడా పాపం వీళ్ళకసలు నోరులేదని కొందరికి, ఉండి అరిచినా వినిపించేటంత సంఖ్య లేరని కొందరికి, అరిచారని కొందరికి, అరాచకించారని ఇంకొందరికి అలా ఇచ్చుకుపోతున్నారు. ఇస్తిరయ్యా వాయనం.. పుచ్చుకుంటిరయ్యా వాయనం.
వాయనం ఏంటో తెలియని వాళ్ళుంటే చెప్పండి? ఇస్తా.. మీకు తప్పకుండా ఇస్తా.
ee 'akaraantha pumlinga' vaayana pradhanam bavundi!
ReplyDeleteసంతోషం :-)
Delete