Wednesday, January 06, 2016

॥ ఒలావ్ – పలావ్ ॥




      సరిగ్గా 20 ఏళ్ళక్రితం ఇలాగే నార్వేలో జనం దాదాపుగా మంచురహిత క్రిస్మస్ జరుపుకుంటున్న రోజులవి. చరిత్రకారులు చరిత్రని పుస్తకాల్లో రాయడం మానేసి వికీపీడియాల్లో నమోదు చేయడం మొదలుపెడుతున్న రోజులు కూడా అవే. అలాంటి రోజుల్లో ఒకరోజు క్రిస్మస్ పార్టీ నుంచి అప్పుడే బయట పడ్డాడు ‘తూరా’. అందరూ పీకలదాకా తాగుతుంటే మనవాడు రెండు పింట్లు ఎక్కువగా అంటే కళ్ళు మునిగే దాకా(మత్తులో) తాగాడు. మగువల తెగువలు తగవులకి దారితీస్తుంటే తగని వాడినని తెలుసుకుని జాకెట్టు, వాలెట్టు కూడా మర్చిపోయి కేవలం శీలంతో బయట పడ్డాడు మన అభినవ నార్వే రాముడు ‘తూరా’. అవును మనవాడు నిజంగా తూ’రాముడే. సీత మనసుతో పాటు జనకుడిని కూడా దోచుకున్నాడు. ఛ..ఛ.. మీరనుకుంటున్నట్టు కట్నకానుకలతో కాదండి. జనకుడి’ది’ (కూడా మనసే) అనబోయి అలా అచ్చుతప్పు. కావాలంటే రెండు వాక్యాలు వెనక్కెళ్ళండి. సో.. అలా తెల్లవారుఝామున 3 గంటలకు వీధిన పడ్డ మన తూరాముడికి హనుమంతుడిలా తారసపడ్డాడు ‘షఫీ’యుద్దీన్. షఫీ పాకిస్తానీయుడు. పొరుగు దేశంలో అంతా సాఫ్టు’వేరు’ పట్టుకుని దేశాలుపడుతుంటే మేము వేర్వేరు అంటూ డ్రై’వేరై’ నార్వే పట్టాడు. అప్పుడప్పుడే నార్వేలో పూసిన ఆయిల్ పూల సువాసన పాకిస్తానీయులు ఆఘ్రాణం చేసుకుంటున్న రోజులవి. ఏది వేరు ఏది చెట్టు ఐతేనేం ‘షఫీ’ అల్లా పెంచిన వెన్నెల తోటలో మనసు చెట్టుకు పూసిన మల్లె పూవు లాంటి తెల్లని మనసున్నవాడు. మన తూరాకి తన జాకెట్టిచ్చి ఇంటి దగ్గర దింపి తన ఇంటికెళ్ళి కారు 3 సార్లు కడుక్కుని కూడా ఒక్క ఓరె కూడా అదనంగా చార్జ్ చెయ్యలేదు. 3 రోజుల తరువాత మన తూరాముడు యోగనిద్ర నుండి బయటపడ్డాడు. గతజన్మ రహస్యం తెలుసుకున్న తమిళ హీరోలా వెంటనే షఫీకి ఫోన్ చేసి యాదోం కి బారాత్ టైటిల్ సాంగ్ bgm తో క్షమాపణలు చెప్పి, కష్టనష్టాలు అడిగి, పడవ ప్రమాదంలో చిన్నప్పుడు తప్పిపోయిన తమ్ముడిలా ఫీల్ అయి సకుటుంబ సపరివార సమేతంగా ఒకసారి మీరంతా మాఇంట్లో చేతులు కడగాలి అని ఒత్తిడి చేశాడు. బేగం కరీమాతో మాట్లాడి, హలాల్ జాగ్రత్తలు కూడా చెప్పిమరీ ‘ఠీక్ హై’ అన్నాడు షఫీ.
        కట్ చేస్తే డిన్నర్ టేబుల్ మీద ఎదురెదురు వరుసల్లో తూరా – షఫీ కుటుంబాలు. (మీద అంటే పైన అని కాదు టేబుల్ కి అటు ఇటు వరుసల్లో అని చదువుకోవాలి). టేబుల్ కి ఒక చివర మన ‘అపూర్వ సహోదరులు’ తూరా – షఫీలైతే మధ్యలో తీరా – కరీమా ఉంటే మరో చివరలో మన కథానాయకా, నాయికలు ఒలావ్, ఉమ్రావ్ లు కూర్చున్నారు. తొందరపడి మనసులో మీరొక డ్యూయెట్ వేసుకోకండి. అప్పటికి ఒలావ్ కి 13, ఉమ్రావ్కి 10, వేళ్ళు కాదు ఏళ్ళు. ఫుడ్ ఎంత బావుందో ఉమ్రావ్ మోహంలో కనపడింది మన ఒలావ్ కి. అప్పుడే ఫుట్ బాల్ మాచ్ నుంచి వచ్చినట్టున్నాడు ఒలావ్, పరశురాముడై విజృంభించాడు. ఆ సాయంత్రం ఎలాంటి అవాంఛనీయ ఉద్విగ్నభరిత సంఘటనలు లేకుండా ఒక కొలిక్కొచ్చింది. వెళుతూ వెళుతూ.. ఓ సారి మీరు కూడా భోజనానికి రావాలి ఒదిన గారు అన్నట్టు చెప్పింది కరీమా.. మొక్కుబడిగా. పాపం ఉమ్రావ్ మాత్రం అందరిలో చాలా ఒంటరిగా ఫీలయింది ఆ సాయంత్రం.
        అన్నట్టు ఉమ్రావ్ కి కూడా ఒక పిట్టకథ ఉందండి. మన షఫీ జీవితంలో యవ్వనం వెర్రి మొగ్గలేస్తున్న రోజుల్లో బాలీవుడ్ నాయకి రేఖకి వీరాభిమాని. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని మంకుపట్టు పట్టికూర్చున్నాడు. ఉమ్రావ్ జాన్ సినిమా విడుదలై వారం రోజులు. కుర్రకారంతా క్రికెట్ గ్రౌండ్ లో పోగై ఆమెపై గాసిప్పుల నిప్పులు చెరుగుతున్న రోజులు. అందునా అవి పైరసీ వీడియో క్యాసెట్లు సరిహద్దులు దాటుతున్నరోజులు. పెళ్ళీ పెటాకులు లేకుండా తిరుగుతున్న షఫీకి ముందు రోజు ఉమ్రావ్ జాన్ పైరసీ క్యాసెట్టు తెచ్చిచ్చి మర్నాడు కరీమాకి అదే గెటప్ వేయించి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టించాడు వాళ్ళ అబ్బాజాన్. ఇంకేముంది అడ్డంగా బుక్ అయిన సంగతి మూడు రాత్రులూ గడిచాకగానీ బోధపడలేదు పురుషుడికి. మర్నాడు పేపర్లో మేకప్ లేకుండా ఉన్న రేఖ ఫోటోని చూసి వేసిన గుటకకి నోట్లో ఉన్న చూయింగ్ గమ్ గుటుక్కున లోపలికిపోయింది. అంతే మర్నాడు చూయింగ్ గమ్ తో పాటే రేఖపై మనసు కూడా పోయింది. ఎందుకో పెళ్లి ఫోటోల్లో మేకప్ తో ఉన్న కరీమానే అందంగా కనిపించసాగింది షఫీకి. కట్ చేస్తే 9 నెలల తరువాత ఒక చేతిలో బేబీ ఉమ్రావ్ ని పెట్టింది కరీమా, ఇంకో చేతిలో నార్వే వీసా పెట్టాడు పోస్ట్ మాన్. ఆనందంతో గాల్లో తేలాడు షఫీ విమానంలో.
        సహపంక్తి భోజనాల్లో చివరాఖర్లో కూర్చుని ‘ఏవండీ.. మాకింకా లడ్డూ రాలేదిక్కడ’ అని అరిచే షుగర్ పేషంట్ లాగా, టైటిల్లో చెప్పిన పలావింకా రాలేదని కంగారు పడుతున్నారా? వస్తున్నా.. తెస్తున్నా..
        ఓకే.. మన కథలో మెయిన్ ట్రాక్ కరీమా కౌంటర్ ఇన్విటేషన్ దగ్గర ఆగింది కదా. అలా పిలవగా పిలవగా ఒక ఇఫ్తారు విందుకి రాక తప్పలేదు మన తీరా-తూరాముల కుటుంబానికి. మునుపెన్నడూ ఇలాంటి అనుభవం లేని మన ఒలావ్ కి ఆ దక్షిణాసియా సుగంధ ద్రవ్యాల సువాసనకి గుమ్మంలోనే మైకం కమ్మినట్టయింది. మళ్ళీ కట్ చేస్తే టేబుల్ మీద అదే ప్యాటర్న్ లో తూరా – షఫీ ల కుటుంబాలు, కాకపొతే టేబుల్ మీద కంటెంటే మారింది. అది ఒలావ్ మీద అనుకోని ప్రభావం చూపింది. ఈసారి ఎదురుగా ఉన్న ఉమ్రావ్ ఉనికి కూడా తెలియలేదు అతగాడికి. ఇజ్నిక్ సిరామిక్ ప్లేట్లో వేడి వేడి పలావ్ వడ్డించింది కరీమా. ఆ ప్లేట్ వంక చూస్తుంటేనే ఒక ఆర్ట్ ఫార్మ్ లా అనిపించింది. ఎటు పట్టుకోవాలో? ఎటు పెట్టుకొవాలో?(నోట్లో) కూడా అర్థంకానంత అందంగా ఉన్నాయి ఆ చెంచాలు. బంగారు తీగల్లాంటి బాస్మతి రైస్, సెలయేళ్ళు ఏళ్లతరపడి కడిగి, సాన పెట్టిన సుతిమెత్తని సున్నపురాతి పిక్కల్లాంటి జీడిపప్పు, అక్కడక్కడా ఉడికిన ముత్యాల్లాంటి కిస్మిస్లు, కన్నెఎంకి ముక్కుపుడకల్లాంటి లవంగాలు, పండిన సంపంగి రేకుల్లాంటి జాపత్రి, ఎండి రాలిపడిన నక్షత్రల్లాంటి అనాసపువ్వులు, తంజావూరు తామ్ర పత్రాల్లాంటి బేయాకులు… ఇలా మెదడు వర్ణిస్తూ పోతుండగా చేతులు, నోరు వాటి పని అవి చర చరా చేసుకుపోతున్నాయి ఒలావ్ కి. అంతే సృష్టిలో ఉన్న భాషలేవీ వర్ణించలేని ఆ అనుభూతికి లోనై అక్కడే పడ్డాడు ప్రేమలో మన ఒలావ్, ఉమ్రావ్ తో కాదు పలావ్తో. నిజ్జంగా పలావ్ తోనే. ఆ తరువాత అలవాటులేని మసాలాలు కడుపులో చేసిన అల్లరికి రెండు రోజులు గృహనిర్భందం కాకతప్పలేదు. అయినా జిహ్వ జయించింది. ఎప్పుడెప్పుడు ఉమ్రావ్ వాళ్ళింటికెళదామా కరీమా చేత్తో పలావ్ వండించుకు తిందామా అని అక్కడికి ఇక్కడికి చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు.
        మరి చిన్నప్పటినుండి పైరేటెడ్ సీడీల్లో బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగిని ఉమ్రావ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలానే అర్థం చేసుకుంది. అంతే ఒలావ్ లో ‘రాహుల్’ని చూసింది, పడింది. ఐ మీన్ మనసు పడింది. ఒలావ్ ని కూడా నెట్టింది. అంతే మనవాడి పులావ్ కి ఉమ్రావ్ తోడయింది. కాలం గడుస్తోంది.
        ఈ తంతు మొత్తానికి మూల స్త్రీ అయిన కరీమాకి విషయం బోధపడటానికి అట్టే సమయం పట్టింది. ఇంట్లో ఈడుకొచ్చిన పిల్ల ఉన్న సంగతి, అలాగే తోరా ఇంట్లో జోడుకొచ్చిన పిల్లాడున్నసంగతి షఫీకి గుర్తుచేసింది. కరీమా మనసులో మాట అర్థంకానట్టు నీకేమైనా అర్థమయిందా అని తూరాని అడిగేసాడు షఫీ. తీరాకేమైనా అర్థమవుతుందేమో అడిగి చెప్తా అన్నాడు తూరా. ఈ చైను ఇలా కంటిన్యూ అయ్యేలోపు మీకసలువిషయం అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపొతే కథ మొదటినుంచి చదవండి. కట్ చేస్తే అహ్మదీయ సాంప్రదాయంలో గ్రోన్లాండ్ మసీదులో ఇద్దరిచేత మూడు సార్లు కుబూలించారు పెద్దలు. పాక్-పశ్చిమాల ('పా' కింద 'ర' వత్తు సైలెంట్) మేలు కలయిక అని నార్వేయంలో గొణుక్కున్నారు అతిధులు.
        మళ్ళీ కట్ చేస్తే అవే మంచురహిత క్రిస్మస్ రోజులు. పైరేటెడ్ సినిమాలు చూసే అలవాటు లేని ఒలావ్, బేగం ఉమ్రావ్ తో కలిసి క్లింగేబెర్గ్ షినోలో ‘బాజీరావ్ మస్తాని’ సినిమాకెళ్ళారు. వాళ్లింకా దియేటర్లోంచి బయటికి రాలేదు వచ్చాక చెబుతా తరువాత ఏమయిందో.

No comments:

Post a Comment