Monday, May 02, 2016

ఏంటీ..? నీకు అది లేదా?




ఎక్కడికెళ్ళినా ఇదే ప్రశ్న. వీధిలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి. ఇహ ఫ్రెండ్స్ ని కలిసినా కలీగ్స్ ని కలిసినా తలకొట్టేసినట్టుంటుంది. ఇంటికెళితే చివరికి అమ్మకూడా “పెళ్ళి కావలసిన పిల్లాడు, ఈ అవమాన భారం ఇంకెంతకాలం మోయనున్నాడో నా బిడ్డ. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా? నా పూజల్లో ఏలోపం జరిగిందో.. ఏమో? శిక్ష నా కొడుకు అనుభవిస్తున్నాడు. ఆపద్భాంధవా.. అనాధరక్షకా.. నా బిడ్డని ఆ లోప విముక్తుడ్ని చేసే భారం నీదే తండ్రీ” ఇన్ని డైలాగులు ఒకే ఒక్క దీనమైన ఎక్స్ ప్రెషన్ లో ఆవిడ చూపించిన క్షణాలెన్నో, అది తట్టుకోలేక తల నేలకేసి తిన్నగా తన గదిలోకెళ్ళి గడియపెట్టుకుని తడిపిన తలగడలింకెన్నో. ఏడ్చి ఏడ్చి అలిసిపోయి ఏదో దీర్ఘాలోచనలో అలా సీలింగ్ వైపు తీక్షణంగా చూస్తుండగా ఇంతలో కరెంటొచ్చి ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది. చల్లగాలికి కన్నీళ్ళైతే ఆవిరయ్యాయిగాని తన మనసులో ఆ లోపం తాలూకు ఆలోచనల సెగలు మాత్రం ఆరలేదు. మళ్ళీ కరెంటుపోయింది ఫాన్ ఆగింది. ఆగిన ఫ్యాన్ ఈసారి కిటికీలోంచి వచ్చే చిరుగాలికి ప్రతి 5 సెకండ్లకొక డిగ్రీ చొప్పున, మధ్య మధ్యలో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కి మరికొన్ని డిగ్రీల చొప్పున తిరుగుతుంటే తనతో ఏదో మాట్లాడుతున్నట్టనిపించింది. పరిపూర్ణమైన డిప్రెషన్లో ఉండటం వల్లో ఏమో అ మాటల్లో “ఉదయ్ కిరణ్, ప్రత్యూష బెనర్జీ, జియా ఖాన్” వీళ్ళ పేర్లు వినపడ్డాయ్. సీలింగ్ ఫ్యాన్లు బాన్ చెయ్యాలన్న రాఖీ సావంత్ మాట కాస్త ధైర్యాన్నిచ్చినా ఎవడి భయం వాడిది. అంతే ఒక్క ఉదుటున లేచి పరిగెత్తి హాల్లో ప్రమిదలకి ఒత్తులల్లుతున్న అమ్మని గట్టిగా కావలించుకుని అమ్మ కొంగంతా తడుపుతూ మొన్న నక్కాశీవారి వీధి రెండవ లైన్లో ఉన్న ‘నిత్యకళ్యాణి మ్యారేజ్ బ్యూరో’లో జరిగిన అవమానం గురించి చెప్పి ఘొల్లుమన్నాడు. ‘నిత్య కళ్యాణ్’ ఆ బ్రోకర్ వెధవ, వాడికింకా పెళ్ళికాలేదుకానీ ఊళ్ళోవాళ్లందరికీ సంభంధాలు చూస్తాడట. వచ్చిన ప్రతి ఆడపిల్లనీ ‘నువ్వేనా..? నాకు నువ్వేనా..?’ అన్నట్టు ఓరకంగా చూసి ఛస్తాడు కామాంధుడు. అలాగే వదిలేస్తే కొన్నాళ్ళకు మగపిల్లల్ని కూడా చూడక తప్పదు వెధవకి. పోయిన గురువారం రిజిస్ట్రేషనుకని వాడి దగ్గిరికెడితే నింపమని ఒక ఫాం చేతికిచ్చాడు. నాకు తెలిసినవి రాసిస్తే.. “ఏంటీ..? ఆ వివరం రాయలేదు? ఆ వివరం లేకుండా పిల్లనెతకడం కష్టం. ఇవాళా రేపు అమ్మాయిలు చాలా ఫాస్ట్. అన్నిటికన్నా ముందు అదుందో లేదో చూస్తున్నారు, వివరంగా ఉంటేనే అప్లికేషన్లు కన్సిడర్ చేస్తున్నారు. అయినా కనీసం అదికూడా లేని కుర్రాడ్ని నిన్నే చూస్తున్నా” అని వెటకారంగా నలుగురిలో పరువు తీశాడు. ఆ ఘటన గురించి విన్న వాళ్ళమ్మ తట్టుకోలేకపోయింది. వెంటనే కొడుకుని ఏడ్చిన మొహం కడుక్కుని పౌడర్ రాసుకుని తయారవ్వమని తనూ రెడీ అయింది. ఊళ్లోనే రంగుబజార్లో బొమ్మలబాబుగా పేరెన్నికగన్న నేటి మేటి ఫోటోగ్రాఫర్ సిరాజుద్దీన్ దగ్గరికి పట్టుకెళ్ళి వాడి చెవిలో ఏదో ఊదింది. వాడేమో వివరం చెప్పకండా తన చేత ‘నాలుగంకె వేస్తూ ఒకటి, థమ్సప్ చెప్పిస్తూ ఒకటి’ అలా అర్థంకాని భంగిమల్లో కొన్ని ఫొటోలు తీసి ఫోటోషాప్ లో పైమెరుగులుదిద్ది అవన్నీ ఒక USBలోకి కాపీచేసి వాళ్ళమ్మ చేతికిచ్చాడు. ఏంటమ్మా ఇదంతా..? అని ఎంత చెప్పినా వినకుండా..  “మారు మాట్లాడకు” అని అక్కడినుంచి తిన్నగా కోతిబొమ్మ సెంటర్లో ఉన్న ‘శ్రీ భ్రమరాంబిక నెట్ కెఫే’కి తీసుకెళ్ళి, USB వాడి చేతిలో పెట్టి వాడి కాళ్ళు పట్టుకుంది. “బాబ్బాబూ.. నీకు పుణ్యముంటుంది ఎలాకొలా నాకొడుక్కొక ఫెస్బుక్కెకౌంటు క్రియేట్ చేసిపెట్టు చచ్చి నీ కడుపున పుడతా.. నీ తల్లిలాంటిదాన్ని” అని వాడి వెళ్ళా, గోళ్ళా పడి ప్రాధేయపడింది. ఇన్నాళ్ళూ తల్లిదండ్రుల మాట గౌరవించి ఈ సామాజిక వలయాలకు దూరంగా బ్రతుకు వెళ్ళబుచ్చాడు నా కొడుకు. సమాజం వాడిని సోషల్లీ ఇనాక్టివ్ అని, ఇనర్ట్ అని, ఐసోలేటెడ్ అని ఇలా నానా మాటలు అంటుంటే కన్నకడుపు తరుక్కుపోతుంది బాబూ. అక్కడ నాకొడుకు ఒంటరి కాకూడదు నాకూ ఒక అకౌంటు క్రియేట్ చెయ్.. వాడికి ఫ్రెండ్ గా ఆడ్ చెయ్. ఓ వందిస్తాను నువ్వూ వాడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు. ఒరేయ్.. అబ్బాయిలూ తలా ఒక ముంత మసాలా ఇప్పిస్తాను నా కొడుక్కి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండర్రా అని ప్రతి క్యాబిన్ కి వెళ్లి ప్రాధేయపడింది. వెల్లికలా దిండుమీద తలపెట్టి పడుకున్నా వెనుకనుంచి ఎవరో చిన్న మెదడు చితికేలా క్యాట్బాల్ తో బెండుముక్కతో చాచిపెట్టి గెట్టిగా కొట్టినట్టనిపించి ఒక్కసారిగా మెలకువ వచ్చింది రాంబాబుకి. వాళ్ళమ్మని ఆపుదామంటే కాళ్ళూ చేతులూ ఎవరో మంచానికి కట్టేసినట్టనిపించింది. ఇది కలేమో అని అనిపించింది. అయితే బావుండనిపించింది. శరీరంలో మెదడు తప్ప ఏ అవయవం చెప్పిన మాట వింటున్నట్టు అనిపించలేదు. ఇహ చేసేదిలేక, నీ ఇష్టం నా పరువు బుగ్గిపాలే అని ఆ పీడకలలోంచి బయటకొచ్చే ప్రయత్నం వదిలేసుకున్నాడు. తరువాత కాసేపటికి నిజంగా మెలకువ వచ్చింది. వొళ్ళంతా చెమటతో ముద్దయింది. కరెంటు పోయి చాలాసేపయింది. వీధి లైట్లు పనిచేస్తున్నట్టున్నాయ్.. కిటికీలోంచి వెలుతురుకి ఆగిపోయిన సీలింగ్ ఫ్యాన్ కనిపించింది. లేవడానికింకో ప్రయత్నం చేశాడు. ఈ సారి ప్రయత్నం ఫలించింది. తలపట్టుకుని జరిగిందంతా జీర్ణించుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ప్రారంభించింది, కరెంటొచ్చింది. ఇహ ఆలశ్యం చేయదలుచుకోలేదు. వెంటనే లాప్టాప్ తెరిశాడు. ఎందుకో ఇంకా చెప్పాలా?

No comments:

Post a Comment