Wednesday, January 06, 2016

(రా)క్షురకుడికి వినతి పత్రం



barber

        గౌరవప్రియమైన బార్బరు బాబు గారికి, వచ్చే శనివారం నిర్ణయింపబడిన, తమరి పవిత్రమైన చేతుల మీదగా నిర్వహింపబడే నా ద్వైమాసిక క్షవర కార్యక్రమాన్ని పురస్కరించుకుని.. పూర్వానుభవం వలన కలిగిన అపూర్వమైన భయంతో కూడిన.. నా భవిష్యత్ పరువుపై గల బాధ్యతతో కలిగిన ముందుచూపుతో మీకు సమర్పించు వినతి పత్రం.
        సరిగ్గా రెండు నెలల క్రితం నా తలపై మీ కత్తెర చేసిన అల్లరి తాలూకు చిటపటలు ఇప్పటికీ నా చెవుల్లో తౌజండ్ వాలాలో సీమటపాకాయల్లా మార్మోగుతూనేవున్నాయి. వచ్చిన ప్రతిసారీ ‘ఈ సారి మీరు ఎలాంటి స్టైలు కోరుకుంటున్నారు?’ అని తమరు సౌమ్యంగా నార్వేయంలో అడగటం, తెలుగునుంచి ఆంగ్లీకరించిన నార్వేయంలో తడి కళ్ళతో, పొడి పొడి మాటలకు నా సంజ్ఞలు జోడించి దశాబ్దాలుగా ఔపోసన పట్టిన నా శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని నా కోరికల చిట్టా పూర్తిగా విప్పకముందే మీరు అంతా అర్థమైందన్నట్టు ‘ఓకే.. ఓకే’ అంటూ ముందుకు దూసుకుపోవడం, కళ్ళు మూసి తెరిచేలోపే తలపై జుట్టంతా చుట్టూ చెల్లాచెదురు అయిపోవటం, ఎదురుగా అద్దంలో ఇప్పటివరకు ఉన్న మనిషి అకస్మాత్తుగా మాయమవటం నాకు షరా మామూలైపోయింది. పైగా చివరలో ఓ అద్దం తెచ్చి నా వెనుక అన్ని కోణాల్లో చుట్టూ తిప్పుతూ మీరు ‘హవీజిట్..? హవీజిట్..?’ అంటుంటే నాకు నా హెయిర్ స్టైల్లో ‘హెయిర్’ ‘వేరీజిట్..? వేరీజిట్..?’ అన్నట్టు వినిపిస్తుంటుంది. మీ పుణ్యమా అని సెలూన్ కి వచ్చిన ప్రతిసారి మా ఇంటికి ఒక కొత్తదారి కనిపెట్టవలసి వస్తుంది. ఎలాగోలా ఇల్లుచేరితే ఇల్లాలు నాలుగు సెక్యూరిటీ క్వశ్చన్స్(అందులో మా ఎంగేజ్మెంట్ డేట్ ఒకటి) అడిగిగానీ ఇంట్లోకి రానివ్వటంలేదు. ఇహ మా చంటోడైతే కనీసం వారం రోజులు నా దెగ్గిరికి రాలేదంటే మీరు నమ్మరు. ముందుచూపుతో పరువు కోసం ఆ వారం రోజులు ఆఫీసుకి శెలవు పెట్టవలసి వచ్చింది. వచ్చే క్రిస్మస్ శెలవల buffer time దృష్టిలో ఉంచుకుని ఈ విడిత ప్లాన్ చేయడం జరిగింది.
        శిశిరంలోనే ఆకులు రాలటం అనేది జగమెరిగిన సత్యం. కాని తలపై జుట్టుకు మాత్రం 365 రోజులూ శిశిరమే అన్న విషయం కేవలం నార్వే యెరిగిన సత్యం. అందుకే నాకు తలసరి వెంట్రుక ఖర్చు(maintenance cost per hair) పెరిగిపోతోందని మనవి. ఇక్కడి ఒక తడవ క్షవరం ఖర్చుతో స్వదేశంలో కనీసం 2 సంవత్సరాల క్షవరం బడ్జెట్ (అదనపు సేవలతో కలిపి) వేయవచ్చు. అందుకే నార్వేలో ధనవంతులంతా బార్బర్లైనా కావచ్చు లేదా బట్టతల గలవాళ్ళయినా కావచ్చునని నా అభిప్రాయం. మరి మీరేమో బట్టతల బార్బరు. ఈ ఆర్ధిక మాంద్యంలో మీ ఆర్ధికస్థితి గురించి ఆలోచిస్తే అసూయగా ఉంది.
        చివరగా నా భవిష్యత్ పరువు, మర్యాద, గౌరవ, సుఖ శాంతులు ఈ శనివారం తరువాత ఒక కొత్త అధ్యాయంలోకి, కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి. వాటికి మీ పూర్తి సహాయ సహకారాలుండాలని ఈ నా వినతి.

No comments:

Post a Comment